జైట్లీ ఓ వేస్ట్ క్యాండిడేట్: స్వామి

భాజపా ఎంపి సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడు నోరు విప్పి మాట్లాడినా ఎవరిపైనో అనుచితంగా మాట్లాడేందుకైనా అయ్యుంటుంది లేదా అది వివాదాస్పదంగానైనా ఉంటుంది. నోట్ల రద్దుతో దేశంలో ఇంత సంచలనం ఏర్పడి ఉంటే ఆయన ఇన్నాళ్ళు నోరు విప్పకుండా ఎలాగ ఉండగలిగారో ఏమో గానీ చివరికి దాని గురించి ఆయన తన అమూల్యమైన అభిప్రాయలు చెప్పేశారు. పనిలోపనిగా కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ఎందుకూ పనిరానివాడని ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు. 

నోట్ల రద్దు గురించి ఆయన ఈసారి కొంచెం ఆలోచింపదగ్గ మాటలే మాట్లాడారని చెప్పవచ్చు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే “ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొన్న నిర్ణయం మంచిదే కానీ దాని పర్యవసానాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. వాటిని ఆయన తక్షణం సరిదిద్దకపోతే, ఇంతవరకు ఆయనకున్న ప్రజాధారణ పోయి దాని స్థానంలో వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది. ఒకప్పుడు మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జన్సీ విధించినప్పుడు కూడా కొంత కాలం ప్రజలు దానిని మెచ్చుకొన్నారు. కానీ దాని పర్యవసానాలు వారికి ఇబ్బంది కలిగించడంతో వారు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేసి దింపేశారు. కనుక దానిని ఒక గుణపాఠంగా భావించి ప్రధాని నరేంద్ర మోడీ వీలైనంత త్వరగా దేశంలో నెలకొన్న ఈ విపరీత పరిస్థితులన్నిటినీ చక్కదిద్దడం చాలా అవసరం. లేకుంటే చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ సమస్యల పరిష్కారం కోసం నిపుణులతో కూడిన ఒక కమిటీని వేయడం మంచిది,” అని సుబ్రహ్మణ్య స్వామి సూచించారు. 

ఈ క్లిష్ట పరిస్థితులలో ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ చాల ఘోరంగా విఫలం అయ్యారని సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొన్న నిర్ణయాన్ని అరుణ్ జైట్లీ సమర్ధంగా అమలుచేయలేకపోయారని స్వామి అభిప్రాయపడ్డారు. అరుణ్ జైట్లీ 2+2 ఎంత అని అడిగితే 4 అని జవాబు చెప్పగలరు. ఆ మాత్రం జ్ఞానమే ఉన్న ఆర్ధికమంత్రి దేశానికి అవసరం లేదు. దేశ ఆర్ధిక వ్యవస్థని సమర్ధంగా నిర్వహించగల మంచి ఆర్ధిక నిపుణుడు ఆర్ధికమంత్రిగా నియమించుకోవడం చాలా అవసరం,” అని సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు.