రేవంత్ రెడ్డితో దోస్తీ..వేరీ బ్యాడ్: కేటిఆర్

తెరాస ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తరువాత అంత శక్తివంతమైన నాయకుడు ఆయన కుమారుడు కేటిఆరే అని అందరికీ తెలుసు. ఆయన ఒప్పుకొన్నా చెప్పుకోకపోయినా ప్రభుత్వంలో, పార్టీలో ఆయనది నెంబర్: 2 స్థానం అని అందరికీ తెలుసు. కనుక కేటిఆర్ వ్యక్తం చేసే అభిప్రాయలు ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయాలుగానే భావించవచ్చు. 

ప్రొఫెసర్ కోదండరామ్ గురించి కేటిఆర్ వ్యక్తం చేసిన అభిప్రాయలని విన్నట్లయితే, ఆయనపై తెరాస సర్కార్ ఎంత ఆగ్రహంగా ఉందో, ఇంతకాలం ఎంత సంయమనంగా ఉందో అర్ధం అవుతుంది. 

కేటిఆర్ నిన్న మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణా ఏర్పడింది నీళ్ళ కోసమే అని ప్రొఫెసర్  కోదండరామ్ కి కూడా తెలుసు. సమైక్య రాష్ట్రంలో మన రైతన్నలకి నీళ్ళు అందకుండా ఆంద్రా పాలకులు జలదోపిడీ చేస్తున్నందునే మనం కేంద్రంతో కోట్లాడి తెలంగాణా సాధించుకొన్నాము. ఇప్పుడు మా ప్రభుత్వం రైతన్నలందరికీ నీళ్ళు అందించే ప్రయత్నం చేస్తుంటే, మా ప్రయత్నాలకి అడ్డు పడుతున్న ప్రతిపక్షాలతో కలిసి ప్రొఫెసర్  కోదండరామ్ కూడా ధర్నాలు చేస్తారా? ఇదెక్కడి అన్యాయం? ఆరు దశాబ్దాలలో కాని పనులన్నీ రెండున్నరేళ్ళలోనే పూర్తయ్యిపోవాలన్నట్లు ఆయన మాట్లాడటం చాలా విచిత్రంగా ఉంది."

"తెలంగాణా ఏర్పడినప్పటి నుంచి అనేక ఊహించని ఇబ్బందులు, సమస్యలని ఎదుర్కొంటున్నాము. అయినా ఈ రెండునరేళ్ళలోనే రాష్ట్రాన్ని యావత్ దేశం, ప్రపంచ దేశాలు కూడా గుర్తించేలాగ చేయగలిగాము. కానీ మన ప్రతిపక్షాలు, ప్రొఫెసర్  కోదండరామ్ వాటిని గుర్తించలేకపోతున్నారు. పైగా ప్రభుత్వంపై నిత్యం విమర్శలు,ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఓటుకి నోటు కేసులో జైలుకి వెళ్ళివచ్చిన రేవంత్ రెడ్డితో కలిసి పనిచేయడానికి కూడా ప్రొఫెసర్  కోదండరామ్ సిగ్గుపడకపోవడం నిజంగా చాలా సిగ్గు చేటు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ గురించి దేశంలో అనేక రాష్ట్రాలు మెచ్చుకొని వాటిని అమలుచేస్తుంటే, మన ప్రతిపక్షాలు వాటిపై కూడా విమర్శిస్తుంటే, ప్రొఫెసర్  కోదండరామ్ వాటికి వంతపాడుతుండటం చాల విచారకరం. అయనవంటి మేధావి చేయవలసిన పనేనా ఇది?” అని కేటిఆర్ సూటిగా ప్రశ్నించారు. మరి దీనికి ప్రొఫెసర్  కోదండరామ్ ఏమని సమాధానం చెపుతారో చూడాలి.