చంద్రబాబు అందుకు పారిపోలేదు: కేటిఆర్

తెదేపా పదేళ్ళ పాటు ప్రతిపక్ష బెంచీలకే పరిమితం అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆంధ్రా, తెలంగాణాలలో తెదేపాని బలంగా నిలబెట్టగలిగారు. తెలంగాణా ఉద్యమాలు ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో కూడా తెలంగాణాలో తెదేపాని కాపాడుకోగలిగారు. కానీ రాష్ట్ర విభజన జరిగి తెలంగాణా ఏర్పడిన తరువాత కాపాడుకోలేకపోతున్నారు. 

తెరాస సర్కార్ ధోరణితో హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్రా ప్రజలు తీవ్ర అభద్రతాభావంతో ఉన్నారని, వారి కోసమైనా     ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నిర్మించుకొనే వరకు హైదరాబాద్ నుంచే పాలన సాగిస్తానని చెప్పిన చంద్రబాబు, వారినీ తన పార్టీని కూడా విడిచి పెట్టేసి తనని తాను కాపాడుకోవడానికి హడావుడిగా ఆంధ్రాకి తరలివెళ్ళిపోవడం అందరూ చూశారు. 

ఆయన ఓటుకి నోటు కేసుకి భయపడే హడావుడిగా విజయవాడ తరలిపోయారని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. కానీ తాను నిప్పు కణిక వంటివాడినని, తాటాకు చప్పుళ్ళకి భయపడేవాడినని కానని నేటికీ గొప్పలు చెప్పుకొంటుంటారు. అది ఆయనకి అలవాటే కనుక పట్టించుకోనవసరం లేదు కానీ మంత్రి కేటిఆర్ కూడా ఆయన ఓటుకి నోటు కేసుకి భయపడి హైదరాబాద్ విడిచి వెళ్ళిపోలేదని చెప్పడమే విచిత్రంగా ఉంది. 

“చంద్రబాబు నాయుడు ఓటుకి నోటు కేసుకి భయపడి హైదరాబాద్ విడిచిపెట్టి విజయవాడ తరలి వెళ్ళిపోయారనే వాదన సరైనది కాదు. ఆయన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తరువాత, ఇక రాష్ట్రంలో తెదేపా మనుగడ సాధించే అవకాశం లేదని గ్రహించి మూటాముల్లె సర్దుకొని హైదరాబాద్ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కనుక వచ్చే ఎన్నికలలో మేము అవశేష కాంగ్రెస్ పార్టీతోనే పోటీ పడవలసి ఉంటుంది. గత ఎన్నికలకి ముందు తెరాసని కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోతుందని పుకార్లు లేవదీశారు. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలే మాపార్టీలో వచ్చి చేరిపోతున్నారు. పిసిసి అధ్యక్షులుగా చేసిన వ్యక్తులు కూడా వచ్చి మా పార్టీలో చేరుతున్నారు. ప్రజలకి మా ప్రభుత్వ పాలనా నచ్చి ఆధారిస్తునందునే అందరూ మాపార్టీలో చేరడానికి వస్తున్నారు. వచ్చే ఎన్నికలలో కూడా ప్రజలు మాపార్టీనే గెలిపించి అధికారం అప్పజెప్పితే పాలిస్తం. వాళ్ళు మమ్మల్ని వద్దనుకొంటే నిరభ్యంతరంగా ఇంట్లో కూర్చొంటాం,” అని కేటిఆర్ చెప్పారు.