తెదేపా ఐడియా బ్యాక్ ఫైర్?

ఏపిలో తెదేపాకి మిత్రపక్షంగా, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న భాజపాని అదుపులో ఉంచేందుకు సిఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు రకరకాల సాకులతో కేంద్రాన్ని విమర్శిస్తుంటారు. ఒకసారి నిధుల మంజూరు చేయలేదని, మరొకసారి ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఇలాగ ఏదో సాకుతో విమర్శిస్తూ కేంద్రప్రభుత్వాన్ని, తద్వారా రాష్ట్ర భాజపాని రాష్ట్ర ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. తద్వారా రాష్ట్రంలో భాజపా ఎదగకుండా చేస్తూ, దాని నుంచి తెదేపాకి పోటీ లేకుండా జాగ్రత్తపడుతుంటారు. 

తెదేపాకి ఒకప్పుడు ఈనాడు బాకా ఊదేది. ఇప్పుడు దాని స్థానాన్ని ఇప్పుడు వేరే పత్రిక తీసుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. ఇటీవల అది రాష్ట్రంలో ఒక సర్వే నిర్వహించి దాని ఫలితాలు ప్రకటించింది. దాని ప్రకారం ఇప్పుడు ఎన్నికలు జరిగి దానిలో తెదేపా, భాజపాలు కలిసి పోటీ చేస్తే 120 సీట్లు, తెదేపా ఒంటరిగా పోటీ చేస్తే 140 సీట్లు సాధిస్తుందని తేల్చి చెప్పింది. అంటే భాజపాకి స్వతంత్రంగా గెలిచే సామర్ధ్యం లేదని, కనుక అది తెదేపాపై ఆధారపడి ఉందని, ఉండక తప్పదని చెప్పకనే చెప్పింది. 

అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి కూడా ప్రజలలో ఏమాత్రం ఆదరణ లేదని, కేవలం అభిమానులే ఆయన వెంట ఉన్నారని తేల్చి పడేసింది. అంటే జనసేన కూడా వాపును చూసి బలుపు అనుకొంతోందని తేల్చి పడేసింది. 

తెదేపాకి జనసేన, భాజపా రెండూ కూడా మిత్రపక్షాలే. కానీ వాటి గురించి బాకా పత్రిక ఈవిధంగా ప్రకటించడం, వాటి గాలి తీసేయడానికేనని వేరేగా చెప్పనవసరమ లేదు. వాస్తవానికి భాజపాకి రెండు తెలుగు రాష్ట్రాలలో స్వంతంగా అధికారంలోకి వచ్చేంత సీన్ లేదని ఎప్పుడో తేలిపోయింది. కానీ తెదేపా, తెరాసలకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని గొప్పలు చెప్పుకోవడం మాత్రం మానుకోదు. కేసీఆర్ దాని గొప్పలు పట్టించుకోనప్పటికీ, చంద్రబాబు మాత్రం తన బాకా మీడియా ద్వారా దాని తోక కత్తిరించే ప్రయత్నం చేశారని చెప్పవచ్చు. 

అసలు దానికి ముక్కుత్రాడు వేయడానికి ఆయనే పవన్ కళ్యాణ్ చేత ప్రత్యేక హోదా సభలు పెట్టిస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ వచ్చే ఎన్నికలలో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో అతనికి కూడా ముక్కుత్రాడు వేయాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లున్నారు. అందుకే మిత్రపక్షాలు రెంటికీ ఒకేసారి చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే బాకా మీడియాతో ఈ సర్వే ఫలితాలు ప్రకటింపజేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

దానిపై పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించలేదు కానీ భాజపా స్పందించింది. ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ “అది డబ్బు ఇచ్చి అనుకూలంగా చేయించుకొన్న సర్వే. అది కేవలం రాజకీయ దురుదేశ్యంతో చేయించినదేనని భావిస్తున్నాను. ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అ సర్వే ఫలితాలని తను నమ్ముతున్నట్లు ప్రకటిస్తే, మేము కూడా మా కార్యాచరణని రూపొందించుకొంటాము,” అని చెప్పారు. 

తమకి అనుకూలంగా ఉన్న ఆ సర్వేని చూసి తెలుగు తమ్ముళ్ళు, వారి అధినేత చంద్రబాబు కూడా ఇప్పుడు దానిని దృవీకరించలేకపోతున్నారు. అలాగని ఖండించలేకపోతున్నారు. చంద్రబాబు ఒకే దెబ్బకి రెండు పిట్టలని కొట్టాలని ప్రయత్నిస్తే అది కాస్త బెడిసికొట్టినట్లయింది. అయినా మిత్రపక్షాలతో సఖ్యతగా ఉంటూ వారి మద్దతు పొందే ప్రయత్నం చేయకుండా ఈవిధంగా వాటి చెయ్యి మెలిపెట్టి నియంత్రించాలని చూడటం తప్పు కదా!