పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హత్యకి కుట్ర జరిగిందని నిన్న ఆమె పార్టీ ఎంపిలు పార్లమెంటులో డ్రామా నడిపించిన తరువాత ఈరోజు మరో సరికొత్త డ్రామా మొదలుపెట్టారు. ఆమె నిన్న రాత్రి నుంచి కోల్ కతాలోని రాష్ట్ర సచివాలయంలో తన ఛాంబర్ లో నుంచి బయటకి రాకుండా తలుపులు మూసుకొని కూర్చొన్నారు. రాష్ట్రంలో అన్ని టోల్ గేట్స్ వద్ద ఆర్మీని మొహరించినందుకు నిరసనగా ఆమె ఈ విచిత్రమైన నిరసన దీక్ష చేస్తున్నారు. ఆర్మీని ఉపసంహరించేవరకు తాను బయటకి రాబోనని ఆమె చెపుతున్నారు. దీనితో సచివాలయ పరిసరాలలో పరిస్థితులు కొంచెం ఉద్రిక్తంగా ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపిలు పార్లమెంటులో ఈవిషయం ప్రస్తావించి, సభని స్తంభింపజేస్తున్నారు. కేవలం తమ రాష్ట్రంలోనే టోల్ గేట్స్ వద్ద ఆర్మీని ఎందుకు మొహరించారని వారు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే ఆర్మీని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు.
నోట్ల రద్దు నిర్ణయాన్ని దేశంలో గట్టిగా వ్యతిరేకిస్తున్న వారిలో మమత బెనర్జీ ఒకరు. ఆమె దాని కోసం వివిధ రాష్ట్రాలలో బహిరంగ సభలు కూడా నిర్వహిస్తుండటం గమనిస్తే ఆమె ఈ విషయంపై ఎంత పట్టుదలగా ఉన్నారో అర్ధం అవుతుంది. అయితే దాని వలన సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే ఏకైక కారణంతోనే ఆమె అంత ఉదృతంగా పోరాడుతున్నారంటే నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఈ సమస్య శాస్వితంగా ఉండేది కాదని అందరికీ తెలుసు. కనుక ఆమె సామాన్య ప్రజల పేరు చెప్పి నల్లధనం పోగేసుకొన్నవారి తరపునే పోరాడుతున్నట్లుగానే అనుమానించవలసి ఉంటుంది.
ఆమె పార్టీలో అనేకమంది నేతలు, ఎంపిలు, మంత్రులు వేలకోట్ల శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో పాలుపంచుకొన్నట్లు ఆ మద్యన వార్తలు వచ్చాయి. వారిలో కొంతమందిని సిబిఐ అరెస్ట్ చేసింది కూడా. అందుకే ఆమె ఈ నోట్ల రద్దుని గట్టిగా వ్యతిరేకిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అనుమానం వ్యక్తం చేశారు. ఈ నోట్లరద్దు కారణంగా ఆ రాష్ట్రంలో చాలా బారీగా నల్లధనం తరలింపులు జరిగే అవకాశం ఉంటుందనే అనుమానంతో, వారిని పట్టుకోవడానికే కేంద్రప్రభుత్వం బహుశః ఆర్మీని టోల్ గేట్లవద్ద మొహరించి ఉండవచ్చు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిజంగానే నల్లధనాన్ని వ్యతిరేకిస్తునట్లయితే ఆమె ఇందుకు అభ్యంతరం చెప్పనవసరం లేదు. కానీ చెపుతున్నారంటే అనుమానించక తప్పదు. అసలు ఆమె ఆర్మీ మోహరింపు పట్ల ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో కారణం చెప్పక పోవడం కూడా ఈ అనుమానానికి బలం చేకూరుస్తోంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఇంత చవకబారు డ్రామాలు అడుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.