నోట్ల రద్దు నిర్ణయంతో భారతదేశాన్ని చౌరస్తాలో నిలబట్టినట్లయింది. అదిప్పుడు ఎటువైపు వెళుతుందా? అని యావత్ ప్రపంచదేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. దేశంలో ప్రతిపక్షాలు ప్రభుత్వ సమర్ధతపై అపనమ్మకం వ్యక్తం చేస్తున్నప్పటికీ, మెజార్టీ ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ పట్ల పూర్తి నమ్మకంతోనే ఉండటం విశేషం.
ఇది అనాలోచిత నిర్ణయమని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. కానీ చాలా దూరదృష్టితో తీసుకొన్న నిర్ణయమని కేంద్రప్రభుత్వ చర్యలు నిరూపిస్తూనే ఉన్నాయి. తగినన్ని నోట్లు ముద్రించక మునుపే ఈ నిర్ణయం అమలుచేయడంతో సమస్యలు తలెత్తడం వలన అందరూ మోడీని విమర్శించగలుగుతున్నారు లేకుంటే ఎవరూ మోడీని వేలెత్తి చూపించే అవకాశమే ఉండేది కాదు. అయితే ఇది తాత్కాలిక సమస్యే తప్ప శాశ్విత సమస్య కాదని అందరికీ తెలుసు. కానీ ఎవరి సమస్యలు, లెక్కలు, ఆలోచనలు వారికి ఉంటాయి కనుక విమర్శిస్తున్నారు. ఈ నోట్ల కొరత తీరేవరకు ఈ విమర్శల పర్వం కూడా కొనసాగుతూనే ఉంటుందని చెప్పవచ్చు.
నోట్ల రద్దుకి నల్లధనం వెలికితీత, నకిలీ నోట్ల బెడద, ఉగ్రవాదులు, వేర్పాటువాదులని కట్టడి చేయడం వంటి అనేక కారణాలు ప్రధాని మోడీ చెప్పారు. కానీ ఆయన మనసులో ఇంకా చాలా ఆలోచనలున్నాయని ఇప్పుడు అర్ధం అవుతోంది. వాటిని ఆయన ఒకటొకటిగా ఇపుడు బయటపెడుతుంటే, అది చూసి కొమ్ములు తిరిగిన రాజకీయ నేతలు, ఆర్ధిక నిపుణులు, ప్రపంచ దేశాలు కూడా ఆశ్చర్యపోతున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ పాత నోట్లు రద్దు చేసి వాటి స్థానంలో కొత్త నోట్లు ప్రవేశపెట్టి అక్కడితో తన పని పూర్తయిందని సరిపెట్టుకొంటారని అందరూ అనుకొన్నారు కానీ బంగారం అక్రమ నిలువలు, బినామీ ఆస్తులని వెలికి తీస్తానని మోడీ చెప్పారు. ఆ దిశలో అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు కూడా. ఆ తరువాత ఆయన దేశాన్ని నగదు రహిత లావాదేవీలవైపు మళ్ళించేందుకు ప్రయత్నాలు మొదలుపెడతారని ఎవరూ ఊహించలేకపోయారు.
ఇప్పుడు దేశంలో మెజార్టీ ప్రజలందరికీ ఆధార్ కార్డులున్నాయి. అవి వారి బ్యాంక్ ఖాతాలతో, ఫోన్ కనెక్షన్, ప్రభుత్వంతో జరిపే ప్రతీ లావాదేవీలతో లింక్ చేయబడ్డాయి. కనుక దేశంలో నగదు రహిత లావాదేవీల అమలుకి ఆధార్ కార్డులని, మొబైల్ ఫోన్లని వాడుకోవాలని మోడీ నిశ్చయించుకొన్నారు. అందుకు వాటిని ఎంచుకోవడం చాలా తెలివైన నిర్ణయమే అని చెప్పక తప్పదు. ఆధార్ కార్డు నెంబర్ చెప్పి, మొబైల్ ఫోన్ లో వేలిముద్ర తీసుకోవడం ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించడానికి కేంద్రప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దాని సాధ్యాసాధ్యాల సంగతి పక్కన బెడితే, అసలు అటువంటి ఆలోచన, ప్రయత్నం చేయడమే చాలా గొప్ప విషయమని అంగీకరించక తప్పదు. ఇప్పటికిప్పుడు దేశంలో ఆ విధానం అమలుచేయలేకపోయినా క్రమంగా అమలుచేయడం నిశ్చయమేనని స్పష్టం అవుతోంది. నోట్ల రద్దు వలన ఎదురవుతున్న అనేక ఊహించని సమస్యలని తట్టుకొని నిలబడగలుగుతున్న భారతదేశం, మున్ముందు ఈ సవాలుని కూడా ధైర్యంగా స్వీకరించగలదనే ఆశిద్దాం.