జనవరి 1 నుంచి హైదరాబాద్ లో అవి బంద్!

హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని తెరాస సర్కార్ చెపుతుంటుంది. కానీ కొన్ని వారల క్రితం కురిసిన బారీ వర్షాలకి నగరం పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అందరూ చూశారు. అప్పటి నుంచి రాష్ట్ర పట్టణాభివృద్ధి మరియు మునిసిపల్ శాఖా మంత్రి కేటిఆర్ హైదరాబాద్ పైనే ప్రధానంగా దృష్టి పెట్టి యుద్దప్రాతిపదికన నగరంలో రోడ్ల మరమత్తులు చేయిస్తున్నారు. కొన్ని చోట్ల పూర్తిగా పాడైన రోడ్ల స్థానంలో కొత్త రోడ్లని నిర్మింపజేస్తున్నారు. అప్పుడప్పుడు ఆయన స్వయంగా నగరంలో తిరిగి రోడ్లు, డ్రైనేజ్ కాలువలు పరిస్థితులని, వాటి పునర్నిర్మాణ పనులని  పరిశీలిస్తున్నారు. తరచూ కార్పోరేషన్ అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తూ, సమస్యలని అడిగి తెలుసుకొంటూ తన స్థాయిలో వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. 

గురువారం కూడా ఆయన మళ్ళీ సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో అభివృద్ధి చెందిన ప్రాంతాలపైనే ఎప్పుడూ శ్రద్ద పెడుతూ మిగిలిన ప్రాంతాలని నిర్లక్ష్యం చేస్తే సహించనని అధికారులని హెచ్చరించారు. గ్రేటర్ పరిధిలో అన్ని వార్డులలో మౌలికవసతుల కల్పన జరగాలని అందుకు ప్రభుత్వం తరపున పూర్తి సహాయసహకారాలు అందిస్తానని చెప్పారు. జనవరి 1వ తేదీ నుంచి నగరంలో బారీ కటౌట్లు, ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టడాన్ని నిషేధిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ తెరాస నేతలే వాటిని ఏర్పాటు చేసినా వారిపై కూడా చర్యలు తీసుకోవడానికి వెనుకాడనని అన్నారు. అలాగే గోడలపై రాతలు, ఎక్కడబడితే అక్కడ చెత్త పారబోసినా, బహిరంగ ప్రదేశాలలో ఉమ్మినా ఇకపై చర్యలు తప్పవని అన్నారు. దానిని అమలుచేసే బాధ్యత డిప్యూటీ మున్సిపల్ కమీషనర్లకి అప్పగిస్తున్నామని, అందుకోసం వారికి మేజిస్ట్రియల్ అధికారాలు కల్పిస్తున్నట్లు మంత్రి కేటిఆర్ చెప్పారు.