మమతా బెనర్జీ హత్యకి కుట్ర జరిగిందా?

నోట్ల రద్దుని వ్యతిరేకిస్తూ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవలసిందిగా చాలా ఉదృతంగా పోరాడుతున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హత్యకి కుట్ర జరిగిందా? అంటే అవుననే వాదిస్తున్నారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపిలు. ఇవ్వాళ్ళ  పార్లమెంటులో వాళ్ళు చాలా హంగామా చేశారు. 

నోట్ల రద్దుని వ్యతిరేకిస్తూ పాట్నాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ఆమె ఇండిగో విమానంలో కోల్ కతాకి తిరిగివస్తున్నప్పుడు దానిలో సరిపడినంత ఇందనం నింపకుండా బయలుదేరదీశారని వారు వాదించారు. ఆ విమానం కోల్ కతా విమానాశ్రయం సమీపానికి చేరుకొన్న తరువాత, దానిలో ఇందనం తక్కువగా ఉందని విమాన పైలట్ గ్రౌండ్ కంట్రోల్ రూమ్ కి తెలిపి అత్యవసరంగా విమానం ల్యాండింగ్ కి అనుమతించవలసిందని కోరినప్పటికీ, సాంకేతిక కారణాల చేత సుమారు అర్ధగంటసేపు అనుమతివ్వలేదని, అంతసేపు ఆ విమానం ఆకాశంలో చక్కర్లు కొట్టవలసి వచ్చిందని తృణమూల్ ఎంపిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ అది గాలిలో ఉండగానే దానిలో ఇందనం పూర్తిగా ఖాళీ అయిపోతే కూలిపోతే దానికి ఎవరు భాద్యత వహిస్తారని ప్రశ్నించారు.

 వారి ప్రశ్నలకి కేంద్ర విమానయాన శాఖా మంత్రి అశోక్ గజపతి రాజు సమాధానమిస్తూ, ఆ విమానం ల్యాండింగ్ అవడానికి కేవలం 12 నిమిషాలు మాత్రమే సమయం తీసుకొన్నారని చెప్పారు. అయినా ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే విమాన పైలట్లు అత్యవసర ల్యాండింగ్ కోసం గ్రౌండ్ కంట్రోల్ ప్రత్యేక పద్దతిలో అనుమతి కోరవలసి ఉంటుందని, సామాన్య పద్దతిలో కోరితే క్రిందన ఉన్న పరిస్థితులని బట్టి ప్రాధాన్యత క్రమంలో విమానాల ల్యాండింగ్ కి అనుమతిస్తుంటారని మంత్రి చెప్పారు. 

విమానంలో ముఖ్యమంత్రితో బాటు ఇంకా చాలా మంది ప్రయాణికులు ఉన్నారని కనుక, ప్రయాణికుల భద్రత విషయంలో విమానసంస్థ, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని భావించడం లేదని మంత్రి చెప్పారు. ఏమైనప్పటికీ, విమానం బయలుదేరే ముందు దానిలో తగినంత ఇందనం నింపారా లేదా? ల్యాండింగ్ కి అనుమతి ఇవ్వడంలో ఏమైనా ఆలస్యం జరిగిందా? అనే విషయం తెలుసుకోవడానికి డిజిసిఎ ని ఆదేశించామని, ఆ నివేదిక రాగానే పార్లమెంటుకి దానిని సమర్పిస్తానని మంత్రి అశోక్ గజపతి రాజు చెప్పారు.