తమిళనాడులో అధికార, ప్రతిపక్ష పార్టీల అధినేతలు ఇద్దరూ ఆసుపత్రిలోనే ఉండటం విశేషం. అధికార అన్నాడిఎంకె పార్టీ అధినేత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత గత రెండు నెలలుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్న సంగతి తెలిసిందే.
ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిఎంకె అధినేత కరుణానిధి కూడా తీవ్ర అనారోగ్యం పాలవడంతో ఆయనని చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆయన వృద్దాప్య సంబధిత ఆరోగ్య సమస్యలని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండవలసి ఉంటుందని చెప్పారు.
ముఖ్యమంత్రి జయలలిత లంగ్స్ ఇన్ఫెక్షన్ కారణంగా మృత్యువు చేరువ వరకు వెళ్ళి మళ్ళీ క్షేమంగా బయటపడగలిగారు. కానీ ఇంకా ఆసుపత్రిలోనే ఉంటూ చికిత్స తీసుకొంటున్నారు. ఆమె ఇంకా ఎప్పుడు ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వస్తారో తెలియదు. కనుక ఆమె తిరిగి వచ్చి తన భాద్యతలు చేపట్టేంతవరకు ఆ రాష్ట్ర ఆర్ధిక మంత్రి పన్నీర్ సెల్వం తాత్కాలికంగా ఆమె బాధ్యతలని నిర్వర్తిస్తున్నారు.
కరుణానిధి వృద్దాప్యం కారణంగా పార్టీని నడిపించలేని స్థితిలో ఉన్నారు కనుక కొన్ని రోజుల క్రితమే ఆయన తన రెండవ కుమారుడు స్టాలిన్ తన రాజకీయ వారసుడని ప్రకటించేశారు. ఇప్పుడు స్టాలిన్ పార్టీని నడిపిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా మూడు రోజుల క్రితం వైరల్ ఫీవర్ తో డిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకొని నిన్ననే ఇంటికి తిరిగి వచ్చారు. ఆమె కూడా పార్టీ పగ్గాలని తన కొడుకు రాహుల్ గాంధీకి అప్పగించాలను కొంటున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా అందుకు ఆమోదం తెలిపింది. కనుక వచ్చే ఏడాది 5 రాష్ట్రాలలో ఎన్నికలు ముగిసిన తరువాత రాహుల్ గాంధీ పట్టాభిషేకం చేసుకొనే అవకాశం ఉంది.