“సమైక్య రాష్ట్రాన్ని 60 ఏళ్ళలో 16మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. వారందరూ కలిసి ఆ 60 ఏళ్ళలో చేయలేనంత అప్పులని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రెండున్నరేళ్ళలో చేశారు. మిగులు బడ్జెట్ ఉన్న ధనిక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణా రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల ఊబిలోకి దింపేశారు. ఆయన ఈ రెండున్నరేళ్ళలోనే ఏకంగా రూ.1.07 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఈ కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారింది. కనుక ప్రజలందరూ కలిసి మన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బారి నుంచి కాపాడుకోవలసిన అవసరం ఉంది. ఆయనని వెంటనే గద్దె దించడానికి ప్రతీ ఒక్కరు పోరాడాలి,” అని తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రజలకి పిలుపునిచ్చారు.
రేవంత్ రెడ్డి గత నెల 6న ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి ‘రైతుపోరు యాత్ర’ పేరిట పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా ఆయన నిన్న మమహబూబ్ నగర్ జిల్లాలో బొంరాస్ పేట మండలంలోని పోలేపల్లి నుంచి కోస్గి వరకు పాదయాత్ర చేసి, దాని ముగింపు సభలో ప్రసంగిస్తూ ప్రజలకి ఈ పిలుపునిచ్చారు.
నకిలీ విత్తనాల వలన రైతన్నలు సుమారు రూ. 690 కోట్లు పంట నష్టపోయారని కనుక ఆ మొత్తాన్ని నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న కంపెనీలు, వాటిని అమ్ముతున్న డీలర్ల దగ్గర నుంచే వసూలు చేసి దానిని రైతులకి పంచాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెరాస సర్కార్ బడా వ్యాపారస్తులు, పారిశ్రమికవేత్తలు, కార్పోరేట్ సంస్థల పట్ల ప్రదర్శిస్తున్న ఉదారత నిరుపేదలు, రైతన్నల పట్ల ఎందుకు చూపించడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.