13 మందితో ‘నోట్ల కమిటీ’ ఏర్పాటు

నోట్ల రద్దు కారణంగా ఎదురవుతున్న సమస్యలని అధిగమించడానికి, నగదు రహిత లావాదేవీల అమలు చేయడానికి తగిన సలహాలు, సూచనలతో కూడిన నివేదిక ఇచ్చేందుకు ఈరోజు 13మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానికి ఏపి సిఎం చంద్రబాబు నాయుడు కన్వీనర్ గా వ్యవహరిస్తారు.

ఈ కమిటీలో మద్యప్రదేశ్ సి.ఎం. శివరాజ్ సింగ్ చౌహాన్, ఓడిశా సి.ఎం.నవీన్ పట్నాయిక్, మహారాష్ట్ర సి.ఎం. దేవేంద్ర ఫడ్నవీస్, సిక్కిం సి.ఎం. పవన్ కుమార్ చామ్లింగ్, పుదుచ్చేరి సి.ఎం. పి. నారాయణ సామి సభ్యులుగా ఉంటారు. వీరుకాక నీతి ఆయోగ్ సి.ఈ.ఓ. అమితాబ్ కాంత్, నందన్‌ నిలేకని, జన్మే జయసిన్హా, రాజేశ్‌ జైన్‌, శరద్‌శర్మ,  జయంత్ వర్మ వంటి నిపుణులు కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ త్వరలో సమావేశమయ్యి ప్రస్తుతం దేశంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల గురించి చర్చించి, వాటిని అధిగమించడానికి తగిన సలహాలు, సూచనలతో కూడిన నివేదికని తయారు చేసి కేంద్రప్రభుత్వానికి అందజేస్తుంది. దానికి అనుగుణంగా కేంద్రప్రభుత్వం చర్యలు చేపడుతుంది.

నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన వెంటనే ఇటువంటి కమిటీని ఏర్పాటు చేసి ఉండి ఉంటే, బహుశః నేడు దేశంలో ఇంత క్లిష్ట పరిస్థితులు ఏర్పడి ఉండేవి కావేమో? కనీసం ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం మేల్కొని, అందరి సలహా సహాయ సహకారాలు కోరడం మంచి నిర్ణయమే అని చెప్పవచ్చు. ఈ కమిటీలో అందరూ చాలా అనుభవజ్ఞులే ఉన్నారు కనుక వారు ఈ సమస్యల నుంచి దేశాన్ని గట్టెక్కించడనికి తగిన సలహాలే ఇస్తారని ఆశించవచ్చు.