రాజీవ్ శర్మకి వీడ్కోలు...ప్రదీప్ చంద్రకి స్వాగతం

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పదవీ కాలం బుదవారంతో ముగియడంతో ఆయన స్థానంలో సీనియర్ ఐ.ఎ.ఎస్. అధికారి కత్తి ప్రదీప్ చంద్రని నియమించారు. రాజీవ్ శర్మకి అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన సేవలని చాలా ప్రశంసించారు. ఉద్యోగుల విభజన, జిల్లాల పునర్విభజన తదితర కార్యక్రమంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించారని మెచ్చుకొన్నారు. ఆయనని రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ హోదా గల ముఖ్యసలహాదారుగా నియమిస్తున్నట్లు ప్రకటించారు.   

రాజీవ్ శర్మ స్థానంలో ప్రదీప్ చంద్ర ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1982 ఐ.ఎ.ఎస్. బ్యాచ్ కి చెందినవారు. ఆయన మద్రాస్ ఐ.ఐ.టి.నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ, ఐ.ఐ.ఎం. కోల్ కతా నుంచి ఎం.బి.ఎ.చేశారు. ఇటీవలే ఆయన యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో పి.హెచ్.డి. కూడా పూర్తి చేశారు.     

ఆయన సమైక్యరాష్ట్రంలో అనేక కీలక పదవులలో పనిచేశారు. సమైక్య రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా, డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గా, రాష్ట్ర షెడ్యూల్ కాస్ట్ కొ-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పోరేషన్ కి మేనేజింగ్ డైరెక్టరుగా, వాణిజ్య మరియు పరిశ్రమల శాఖకి ప్రధాన కార్యదర్శిగా, ఇండస్ట్రియల్ ప్రమోషన్ విభాగానికి కమీషనర్ గా వ్యవహరించారు. విశాఖ, గుంటూరు జిల్లాలకి కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ పదవి చేపట్టక మునుపు ఆయన తెలంగాణా రెవెన్యూ శాఖ ప్రధానకార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.