శభాష్ సిఎం.గారు

నోట్ల రద్దు తదనంతర పరిణామాలని అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ నేపధ్యంలో రేపటి నుంచి రాష్ట్రంలో 3.30 లక్షల మంది ప్రభుత్వోద్యోగులకి జీతాలు, 2.50 లక్షల మంది పెన్షనర్లకి పెన్షన్లు ఒకేసారి అందించడం ఎంత కష్టమో ఊహించవచ్చు. ముఖ్యంగా పెన్షన్లపైనే ఆధారపడి జీవిస్తున్న రిటైర్డ్ ఉద్యోగులకి పెన్షన్లు ఏ మాత్రం ఆలస్యం అయినా చాలా ఇబ్బందికర పరిస్థితులని ఎదుర్కోక తప్పదు. అందుకే నవంబర్ నెల జీతాలు, పెన్షన్లలో రూ.10,000 నగదు రూపంలోనే చెల్లించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి లేఖ వ్రాశారు. దానికి రిజర్వ్ బ్యాంక్ కూడా అంగీకరించడంతో రాష్ట్రంలో అన్ని బ్యాంకులలో ఈ చెల్లింపుల కోసం వేరేగా కౌంటర్లు, క్యూ లైన్లు వాటికి అవసరమైన ఏర్పాట్లు యుద్ద ప్రాతిపదికన చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లకి కూడా ఈ బాధ్యత అప్పగించారు. ఈ  చెల్లింపుల కోసమే ప్రత్యేకంగా రూ. 600 కోట్లు కేటాయించవలసి ఉంటుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ అంచనా వేసింది. 

రాష్ట్రంలోని ఉద్యోగులు జీతాలు, పెన్షనర్ల పెన్షన్లు యధాప్రకారం ఈరోజు అర్ధరాత్రి తరువాత వారివారి బ్యాంక్ ఖాతాలలో ప్రభుత్వం జమా చేస్తుంది. ఉద్యోగులు, పెన్షనర్లు రేపు ఉదయం బ్యాంకులకి వెళ్ళి తమ గుర్తింపు కార్డులని చూపించి ఒక్కొక్కరూ రూ.10,000 నగదు తీసుకోవచ్చు. ముఖ్యమంత్రి ముందు చూపుతో వ్యవహరించడం వలన లక్షలాది ఉద్యోగులు, పెన్షనర్లకి ఇబ్బంది లేకుండా ఏర్పాటు జరిగింది. అందుకు ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.

ఇటువంటి వ్యవహారాలలో చాలా ముందుచూపుతో వ్యవహరించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఇంకా బ్యాంకర్లతో చర్చిస్తూనే ఉండటం విశేషం. వీలైతే కొంత మొత్తం నగదు రూపంలో ఇవ్వడానికి ప్రయత్నిస్తామని లేకుంటే, డెబిట్ కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవాలని సలహా ఇస్తున్నారు.