కేకే సర్వే బోగస్: బల్మూరి వెంకట్

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్‌ పార్టీకి విజయావకాశాలున్నట్లు సర్వే నివేదికని ప్రకటించిన ‘కేకే సర్వే’పై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్రంగా స్పందించారు. ఈరోజు అయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఇదొక బోగస్ సర్వే. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలలో ఓటమి తప్పదని గ్రహించిన కేటీఆర్‌, హరీష్ రావు ఇద్దరూ ఇంట్లో కూర్చొని తమకు అనుకూలంగా ఈ కేకే సర్వే తయారుచేయించుకొని మీడియాకు విడుదల చేశారు. 

దీంతో వారు ఓటర్లను ప్రభావితం చేయాలని కుట్ర చేస్తున్నారు. అయితే కేకే సర్వే గతంలో కూడా బీఆర్ఎస్‌ పార్టీకి అనుకూలంగా చెప్పిన జోస్యాలు ఫలించలేదు. అయినా మళ్ళీ కేకే సర్వే పేరుతో గట్టెక్కాలనుకుంటున్నారు. ఎన్నికల కమీషన్ ఇలాంటి సర్వేలు చేయరాదని, పోలింగ్ ముందు నివేదికలు ప్రకటించరాదని చాలా స్పష్టంగా చెప్పింది. కనుక బీఆర్ఎస్‌ పార్టీ చేసిన ఈ కుట్ర ఎన్నికల నియామావళిని ఉల్లంఘించడమే అవుతుంది. కనుక దీనిపై రేపు రిటర్నింగ్ అధికారికి, ఎన్నికల కమీషనర్‌కి పిర్యాదు చేస్తాము,” అని బల్మూరి వెంకట్ అన్నారు.