తెలంగాణా ప్రజలందరికీ
కవితక్కగా సుపరిచితురాలైన నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవితకి ఒక అపురూపమైన గౌరవం
దక్కింది. అది ప్రభుత్వమో లేదా ఏదో సంస్థ నుంచి పొందినది కాదు తన ప్రజల నుంచి పొందిన
గొప్ప అరుదైన పురస్కారం. ఆమె ప్రాతినిద్యం వహిస్తున్న నిజామాబాద్ జిల్లాలో ఆర్మూరులోని
ఖానాపూర్ గ్రామ పంచాయితీ ప్రజలు తమ గ్రామం పేరుని ఆమె పేరిట కవితాపురంగా
మార్చుకొన్నారు. ఆ మేరకు గ్రామ పంచాయితీ సభలో ఒక తీర్మానం చేసి ఆమోదించి దాని
గురించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు.
అందుకు బలమైన కారణమే
ఉంది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు క్రింద ఖానాపూర్ గ్రామం ముంపుకి గురవుతున్న
కారణంగా అక్కడ నివాసం ఉంటున్న 274 కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. వారి తమ గోడుని
కవితక్కకి మోర పెట్టుకోగా ఆమె తక్షణం స్పందించి, వారి గ్రామానికి సమీపంలో అందరికీ
భూములు కేటాయింపజేశారు. అందుకు కృతజ్ఞతగా తమ గ్రామానికి కవితాపురం అని పేరు
పెట్టుకొన్నట్లు ఆ గ్రామ సర్పంచ్ మమతా నరేష్ చెప్పారు. అయితే రెవెన్యూ రికార్డులలో
తమ గ్రామం పేరు మారేవరకు ఖానాపూర్ గానే వ్యవహరించినప్పటికీ వాడుకలో మాత్రం ఇక
నుంచి కవితాపురంగానే పిలుచుకొంటామని చెప్పారు. ఆ విషయం స్థానిక ప్రజలందరికీ తెలియజేస్తూ
గ్రామం ప్రవేశ మార్గం దగ్గర పెద్ద హోర్డింగ్ కూడా ఏర్పాటు చేశారు. తమందరికీ డబుల్
బెడ్ రూమ్ ఇళ్ళు కట్టించి ఇవ్వడానికి కూడా కవితక్కే చొరవ తీసుకోవాలని సర్పంచ్
నరేష్ కోరారు.
యూనివర్సిటీలో లేదా కేంద్రరాష్ట్ర
ప్రభుత్వాలో లేదా స్వచ్చంద సంస్థలో రాజకీయ నాయకులకి అవార్డులు ఇచ్చి గౌరవించడం
చాలా సహజమే. రాజకీయాలలో ఉన్న ప్రతీ ఒక్కరికీ ఆ అవకాశం ఉంటుంది. కానీ తమ ప్రజల నుంచి
ఈవిధంగా గౌరవం పొందడం చాలా అరుదు. ప్రజల పట్ల మానవతా దృక్పదంతో వ్యవహరిస్తే వారు
ఈవిధంగా స్పందిస్తారో ఖానాపూర్...సారీ...కవితాపురం గ్రామ ప్రజలు నిరూపించి
చూపిస్తే, ప్రజా సమస్యల పట్ల ఏవిధంగా వ్యవహరిస్తే ప్రజాధారణ పొందవచ్చో కవితక్కకి
నిరూపించి చూపారు. ఈ సందర్భంగా ఆమెకి తెలంగాణా ప్రజలందరి తరపున అభినందనలు
తెలియజేస్తున్నాము.