పాక్ ఉగ్రవాదులు మళ్ళీ ఆర్మీ క్యాంప్ లోకి జొరబడి ఏడుగురు భారతీయ సైనికులని బలిగొన్నారు. మంగళవారం ఉదయం శ్రీనగర్ లోని నగ్రోటాలోగల సైనిక స్థావరంలోకి ఉగ్రవాదులు జొరబడి 166 ఆర్టిలరీ రెజిమెంట్ పై విచక్షణా రహితంగా కాల్పులు జరుపడంతో అక్కడిక్కడే ఐదుగురు జవాన్లు, ఇద్దరు అధికారులు మరణించారు. ఈసారి ఉగ్రవాదులు తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో కొందరు జవాన్లని బందీలుగా పట్టుకొన్నారు కానీ వారిని చుట్టుముట్టిన భద్రతాదళాలు ముగ్గురు ఉగ్రవాదులపై గుళ్ళ వర్షం కురిపించి తమ సహచరులని కాపాడుకొన్నారు. ముగ్గురు ఉగ్రవాదులు స్థానిక పోలీస్ యూనిఫారం ధరించి రావడంతో వారిపై ఎవరికీ అనుమానం కలుగలేదు. దానితో వారు సులువుగా లోపలకి ప్రవేశించి, ఏడుగురు జవాన్లని బలిగొన్నారు.
యూరి ఆర్మీ క్యాంప్ పై ఉగ్రవాదుల దాడి తరువాత మళ్ళీ ఆ స్థాయిలో దాడులు జరుగడం, వాటిలో ఒకేసారి ఇంతమంది జవాన్లు మరణించడం ఇదే మొదటిసారి. అయితే యూరి దాడి తరువాత కూడా దాని నుంచి ఎటువంటి గుణపాఠం నేర్చుకోలేకపోవడం, ఇటువంటి దాడులని నివారించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, అప్రమత్తంగా లేకపోవడం చాలా విస్మయం కలిగిస్తుంది.
సరిహద్దుల వద్ద శత్రు సైనికులతోనో లేదా ఉగ్రవాదులతోనో పోరాడుతున్నప్పుడు జవాన్లు మృతి చెంది ఉంటే దానిని అర్ధం చేసుకోవచ్చు కానీ ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు పటిష్టమైన భద్రత కలిగిన ఆర్మీ క్యాంప్ లోకి జొరబడుతూ ఇంత మంది జవాన్లని బలి తీసుకోగలగుతుండటం మన భద్రతాలోపమే అని చెప్పకతప్పదు. ఇటువంటి సంఘటనలు ఒకసారి జరిగితే అది పొరపాటు అని సరిపెట్టుకోవచ్చు కానీ పదేపదే జరుగుతుంటే ఏమనుకోవాలి? ఎవరిని నిందించాలి?