ప్రజల చేత శభాష్ అనిపించుకోవాలని ఎవరికి ఉండదు? టిఆర్

రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. దానిలో తమ ప్రభుత్వ పనితీరు గురించి అడిగిన ఒక ప్రశ్నకి జవాబిస్తూ “ప్రజలు కోరుకొన్న పనులు చేసిబెట్టి వారి చేత శభాష్ అనిపించుకోవాలని ఎవరికి ఉండదు? చాలా పనులు అవలీలగా చేయవచ్చని అర్ధం అవుతూనే ఉంటుంది. కానీ మన ప్రభుత్వ వ్యవస్థలలో ఎంత చిన్న పని జరగాలన్నా దానికి పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. అదే పనులకి ప్రధాన ఆటంకంగా మారుతుంటుంది. అది చూసి చాలా బాధ కలుగుతుంటుంది. ఒకటా రెండా 60 సం.ల పాటు నిర్మించుకొన్న వ్యవస్థ అది. దానిని సమూలంగా లోపభూయిష్టంగా మార్చాలంటే చాల ప్రయత్నం చేయాలి.

గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్లు, మిడ్ మానేరు ప్రాజెక్టు వంటి కొన్ని పనులలో జరుగుతున్న ఆలస్యానికి ఈ వ్యవస్థలో ఉన్నపాత పద్దతులే పెద్ద అవరోధంగా మారాయి. ఫైల్స్ ఒక ఆఫీసు నుంచి మరొక ఆఫీసుకి, ఒక అధికారి నుంచి మరొక అధికారికి కదిలేసరికే పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. అప్పుడు మనం అనుకొన్నది ఏమిటి...ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? మనం ఎంత వేగంగా ఉన్నా మన వ్యవస్థ అంత వేగంగా స్పందించడం లేదే అనే బాధ కలుగుతుంటుంది. అప్పటికీ...ఈ రెండున్నరేళ్ళలో ప్రభుత్వ వ్యవస్థలలో పనులకి ఆటంకం కలిగిస్తున్న అనవసరమైన నియమనిబంధనలని గుర్తించి తొలగిస్తున్నాము. కంప్యూటర్లు, ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొంటూ పనులు వేగవంతం అయ్యేందుకు చాలా సంస్కరణలు చేశాము. అయినా కూడా ప్రభుత్వ వ్యవస్థలో మార్పులు తేవలసినవి ఇంకా చాలానే ఉన్నాయి,” అని అన్నారు.