ప్రభుత్వ వాహనం, సెక్యూరిటీ లేకుండా మంత్రి కొండా సురేఖ


మంత్రి కొండ సురేఖ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఆమె వద్ద పనిచేసే ఓఎస్‌డీని విధులలో నుంచి తప్పించి వరంగల్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడంతో ఆమె తీవ్ర అసహనంగా ఉన్నారు. ఆమె ప్రభుత్వ వాహనాలను, భద్రత సిబ్బందిని వదిలేసి సొంత వాహనంలో మంత్రివర్గ సమావేశంలో పాల్గొనేందుకు బయలుదేరారు. తద్వారా మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమని సంకేతం ఇచ్చినట్లయింది. 

ఈలోగా ఆమెకు తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్ ఫోన్‌ చేశారు. తనని కలిసేందుకు ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రావలసిందిగా కోరారు. ఈలోగా బయట మీడియాతో మాట్లాడవద్దని సూచించారు. కనుక మంత్రి కొండా సురేఖ ఆమెను కలిసేందుకు సొంత కారులో ఒంటరిగా బయలుదేరారు. 

ఆమెతో భేటీ తర్వాత మంత్రివర్గ సమావేశంలో పాల్గొంటారు. సిఎం రేవంత్ రెడ్డికి వివరణ ఇచ్చుకునే అవకాశం ఉంది. కానీ ఒకవేళ సిఎం రేవంత్ రెడ్డి ఆమెను రాజీనామా చేయమని కోరితే వెంటనే చేసే అవకాశం కూడా ఉంది. బహుశః అందుకు సిద్దపడే ఆమె ప్రభుత్వ వాహనాలను, భద్రత సిబ్బందిని వదిలేసి సొంత వాహనంలో బయలుదేరి ఉండవచ్చు.