నవీన్ యాదవ్ సెల్ఫ్ గోల్?

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలలో పోటీ చేయబోయే కాంగ్రెస్‌ అభ్యర్ధులలో నవీన్ యాదవ్ పేరు కూడా ఉంది. కాంగ్రెస్‌ అధిష్టానం ఆమోదం తెలిపితే ఆయనే పోటీ చేస్తారు. కానీ నవీన్ యాదవ్ అత్యుత్సాహం ప్రదర్శించి ఈ అవకాశాన్ని చేజార్చుకున్నారు.

ఈ నెల 4వ తేదీన యూసఫ్‌ గూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఓటర్ కార్డుల పంపిణీ కార్యక్రమం అంటూ ఫ్లెక్సీ బ్యానర్ ఏర్పాటు చేసి మరీ నకిలీ ఓటర్ కార్డులు తయారు చేయించి పంపిణీ చేశారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక జరుగబోతున్నందున ఎన్నికల సంఘం నియోజకవర్గంలో కొత్త ఓటర్లను నమోదు చేసి కార్డులు సిద్దం చేసింది. వాటిని ఎన్నికల సంఘం మాత్రమే ఓటర్లకు పంపిణీ చేయాలి. కానీ ఈలోగా నవీన్ యాదవ్ నకిలీ కార్డులు తయారు చేయించి  మీడియా సమక్షంలో పంపిణీ చేశారు. 

దీనిపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. జూబ్లీహిల్స్‌ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న యూసఫ్‌ గూడా సర్కిల్, డిప్యూటీ మున్సిపల్ కమీషనర్ రజనీకాంత్ రెడ్డి మధురానగర్ పోలీసులకు పిర్యాదు చేశారు. ఇది ఎన్నికల చట్టాలను ఉల్లంఘనే కనుక చట్ట విరుద్దంగా వ్యవహరించినందుకు పోలీసులు ఆయనపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.  

నవీన్ యాదవ్ ఎన్నికలలో పోటీ చేయకుండా అనర్హుడుగా ప్రకటించాలని బీఆర్ఎస్‌ పార్టీ ఈసీని కోరింది. కాంగ్రెస్‌ అధిష్టానం నేడో రేపో నవీన్ యాదవ్ పేరు ప్రకటించవచ్చని అనుకుంటే, ఆయన అత్యుత్సాహం ప్రదర్శించి మంచి అవకాశం కోల్పోయారు.