నోట్ల రద్దు గురించి భాజపా దాని మిత్రపక్షాల నేతలందరికీ ముందే సమాచారం అందించి, వారు అంతా సర్దుకొన్నాకనే ప్రధాని నరేంద్ర మోడీ ఆ ప్రకటన చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాటిని భాజపా నేతలు గట్టిగా ఖండిస్తున్నారు కానీ ప్రతిపక్షాలు నమ్మడం లేదు..వారిపై ఆరోపణలు చేయడం మానుకోలేదు. కనుక మోడీ తమ పార్టీ, ప్రభుత్వ నిజాయితీని నిరూపించుకొనేందుకు మరొక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొన్నారు. భాజపా నేతలు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా తను ప్రకటన చేసిన రోజు నుంచి అంటే నవంబర్ 8 నుంచి డిశంబర్ 31వ తేదీ వరకు తమ బ్యాంక్ ఖాతాల ద్వారా నిర్వహించిన లావాదేవీల వివరాలని జనవరి 1వ తేదీన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకి సమర్పించాలని ఆదేశించారు. ఇది కేంద్ర, రాష్ట్ర మంత్రులకి కూడా వర్తిస్తుందని చెప్పారు.
నోట్ల రద్దు నిర్ణయంతో మోడీ తన రాజకీయ భవిష్యత్ ని పణంగా పెట్టారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఆయన తన స్వంత పార్టీ నేతల బ్యాంక్ అకౌంట్ వివరాలు కోరడంతో బహుశః పార్టీలో కూడా కొత్త శత్రువులని తయారు చేసుకొన్నట్లు అవుతుందని చెప్పవచ్చు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయంలో తన చిత్తశుద్ధిని నిరూపించుకొనే ప్రయత్నం చేస్తున్నారు కనుక ఆయనకి పార్టీ నేతలు కూడా సహకరించినట్లయితే వారికే చాలా మంచిది.