నోట్ల రద్దుపై కేసీఆర్ ఏమ్మన్నారంటే..

పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, ఇప్పుడు దానిని స్వాగతించడమే కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలు, ఆశయలకి అనుగుణంగా రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలని ప్రోత్సహించాలని నిశ్చయించుకొన్నారు. నోట్ల రద్దు వలన తాత్కాలికంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తున్నప్పటికీ, దీర్గకాలంలో దాని వలన చాలా ప్రయోజనాలు ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ నోట్ల కష్టాలకి పరిష్కారం కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ లని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈసారికి ఉద్యోగుల జీతాలు నగదు రూపంలో చెల్లించడానికి బ్యాంకులని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. 

రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలని ప్రోత్సహించడానికి త్వరలోనే టిఎస్ వ్యాలెట్ అనే పధకాన్ని ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ప్రస్తుతం ఈ విధానంలో విధిస్తున్న పన్నులని పూర్తిగా ఎత్తివేయడమో లేకపోతే పూర్తిగా తగ్గించడమో చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అప్పుడు అందరూ నగదు రహిత లావాదేవీల పట్ల ఆసక్తి చూపుతారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. 

నగదు రహిత లావాదేవీలని మొదట సిద్ధిపేట శాసనసభ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలుచేసి చూస్తామని చెప్పారు. ముందుగా అక్కడి ప్రజలందరి చేత బ్యాంక్ అకౌంట్లు తెరిపించి డెబిట్ కార్డులు ఇచ్చిన తరువాత ఈ ప్రయోగం అమలుచేసి చూస్తామని చెప్పారు. అయితే రూ.500 లోపు లావాదేవీలని నగదు రూపంలోనే జరుపుకొనే విధంగా జాగ్రత్తలు తీసుకొంటామని చెప్పారు. తద్వారా సామాన్య ప్రజలు, చిన్నచిన్న వ్యాపారుల రోజువారి ఆర్ధిక లావాదేవీలకి ఇబ్బంది ఉండదని అన్నారు. 

నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వామపక్షాలు, కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో కేసీఆర్, చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ వంటివారి మద్దతు కూడగట్టగలగడం గొప్ప విషయమే. వారందరి అందదండలతో ప్రతిపక్షాల ఒత్తిడి తట్టుకొని ఈ మహత్కార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయడం సాధ్యమే. దీనికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మద్దతు కూడా కూడగట్టగలిగినట్లయితే, ప్రతిపక్షాలని ఎదుర్కోవడం ఇంకా సులభం అవుతుంది.