చంద్రబాబు నేతృత్వంలో ముఖ్యమంత్రుల కమిటీ

నోట్ల రద్దు కారణంగా ప్రస్తుతం దేశంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితులని అధిగమించేందుకు కేంద్రప్రభుత్వం 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడిన ఒక ఉప సంఘాన్ని నియమించబోతోంది. దానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సారధ్యం వహించవలసిందిగా కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ కోరారు. విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ కమిటీలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ లేరు. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, త్రిపుర, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, శివరాజ్ సింగ్ చౌహాన్, నితీష్ కుమార్, మాణిక్ సర్కార్, నారాయణ సామి ఆ కమిటీలో ఉంటారని తాజా సమాచారం. కమిటీ వివరాలు, దాని విధి విధానాలు, గడువు మొదలైన వివరాలన్నీ నేడోరేపో కేంద్రం ప్రకటిస్తుంది. ఈ కమిటీ నోట్ల కష్టాలకి తగిన పరిష్కారాలు, నగదు రహిత లావాదేవీలకి అవసరమైన సూచనలు చేయవలసి ఉంటుంది.