ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన తరువాత నుంచి ఒక్కో వ్యక్తి రోజుకి రూ.2,000కి మించి తీసుకొనే అవకాశం లేకుండా పోయింది. నోట్ల మార్పిడితో కలుపుకొన్నా కూడా అది రూ.50,000 కంటే మించదు. ఈ లెక్కలు సామాన్యులకి మాత్రమే వర్తిస్తాయి. కానీ రాజకీయ నేతలకి కాదు. నిన్న రాత్రి తమిళనాడులో సేలం జిల్లాలో కుమారసామి పట్టి అనే ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా, భాజపా యువమోర్చా నేత అరుణ్ రామ్, అతని స్నేహితుడు భువనేష్ కారులో రూ.18.5 లక్షలు విలువ చేసే కొత్తనోట్లు కనుగొన్నారు. వాటిలో రూ.2,000 నోట్ల కట్టలు చాలా ఉన్నాయి. ఆ డబ్బు అంత తనదేనని తాము చిన్నతిరుపతి (ఏలూరు) నుంచి వస్తున్నట్లు అరుణ్ రామ్ చెప్పాడు. కానీ ఆ డబ్బుకి తగిన కాగితాలు ఏవీ వారు చూపించలేకపోవడంతో పోలీసులు దానిని స్వాధీనం చేసుకొని కలెక్టర్ కార్యాలయానికి తరలించారు.
ఈ సంఘటన నల్లధనం దాచుకొన్నవారు దానిని ఏ స్థాయిలో వైట్ గా మార్చేసుకొంటున్నారో నిరూపిస్తోంది. సామాన్య ప్రజలు తమ బ్యాంక్ ఖాతాలలో ఉన్న కొద్దిపాటి డబ్బునే తీసుకోలేక నానా కష్టాలు పడుతుంటే, నోట్ల రద్దుతో దేశంలోని నల్లధనం వెలికి తీస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న భాజపాకి చెందిన నేతలే ఇటువంటి వ్యవహారాలలో పట్టుబడుతుండటం విశేషం. నాలుగైదు రోజుల క్రితం మహారాష్ట్రాలో సుబాష్ దేశ్ ముఖ్ అనే ఒక భాజపా మంత్రికి చెందిన వాహనంలో ఏకంగా రూ 92 లక్షలు (పాత నోట్లు) పట్టుబడ్డాయి. వాటిని ఆయన అనుచరులు రాత్రిపూట రహస్యంగా కారులో తరలిస్తుండగా పోలీసులకి పట్టుబడ్డారు. ఇప్పుడు తమిళనాడులో ఈ భాజపా నేత ఏకంగా రూ.18.5లక్షలు కొత్త నోట్లతోనే పట్టుబడ్డాడు. దీనికి భాజపా, కేంద్రప్రభుత్వం ఏమని జవాబు చెపుతాయి?