నెలవారీ జీతాలపై
బ్రతుకు బండి నడిపిస్తున్న సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు అందరూ ఒకటవ తారీకు కోసం నెలరోజుల
పాటు చకోర పక్షుల్లాగా ఎదురుచూస్తుంటారు. వారి జీవితంలో ఆ ఒక్కరోజే కాస్త ధైర్యం
కనిపిస్తుంది. ఇంటి అద్దె, కరెంటు బిల్లు, పిల్లల స్కూలు ఫీజులు, కిరాణా, కూరలు, పాలు
అన్నిటికీ దానిని సర్దేసాక మళ్ళీ ఒకటవ తారీకు కోసం ఎదురు చూపులు మొదలుపెడతారు.
కానీ ఈసారి మాత్రం ఒకటవ తారీకు వస్తోందంటే అమ్మో! అని భయపడే పరిస్థితి నెలకొంది.
నోట్ల రద్దు కారణంగా
అనేక ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులకి నగదు రూపంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి
నెలకొని ఉంది. కనుక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగుల జీతాలని వారి బ్యాంక్
ఖాతాలలో జమా చేసినా ప్రస్తుత పరిస్థితులలో దానిని బయటకి తీసుకొనే అవకాశం లేదు. కేవలం
రూ.2,000ల కోసం ప్రజలు బ్యాంకులు, ఎటిఎంల చుట్టూ తిరుగవలసిన పరిస్థితులు నెలకొని
ఉన్నప్పుడు, త్వరలో బ్యాంకులలో జమా అయ్యే జీతాలని ఏవిధంగా బయటకి తీసుకోగలరు? ఎటిఎంలలో
ఎప్పుడు డబ్బు ఉంటుందో తెలియని పరిస్థితులు. ఏ బ్యాంకు వద్ద చూసినా బారెడు క్యూ
లైన్లు. ఈ పరిస్థితులలో రోజుకి రూ.2,000 చొప్పున తమ జీతాలని మొత్తం బయటకి తీసుకోవాలంటే
ఉద్యోగులు అందరూ శలవులు పెట్టి క్యూ లైన్లలో నిలబడాల్సి ఉంటుంది. అది సాధ్యం కాదు కనుక
మరి వారి పరిస్థితి ఏమిటి? ఉద్యోగులు ఒకేసారి తమ జీతాన్ని బ్యాంకులు, ఎటిఎంల నుంచి
విత్ డ్రా చేసుకొనేందుకు వీలుగా కేంద్ర ఆర్ధిక శాఖా లేదా రిజర్వ్ బాంక్ మిగిలిన ఈ
రెండు రోజులలోనే ఏదో ఒక నిర్ణయం ప్రకటించకపోతే, దేశ వ్యాప్తంగా ఉద్యోగులు, వారి
కుటుంబాలు కొత్త ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.