ఎటిఎంలలో చాలా డబ్బు ఉందిట!

దేశంలో పాటల నోట్లని రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 8న ప్రకటించారు. అప్పటి నుంచి ప్రజలకి ఊహించని కష్టాలు మొదలయ్యాయి. ఇటువంటి సమయంలో సామాన్య ప్రజలకి ధైర్యం చెప్పవలసిన ఎన్డీయే మిత్రపక్షాలు కేంద్రప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాలక్షేపం చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, కేరళ వంటి కొన్ని రాష్ట్రాలలో  అధికారంలో ఉన్న పార్టీలే ప్రతిపక్షాలతో కలిసి బంద్ లు నిర్వహిస్తూ సామాన్య ప్రజలు ఇంకా ఇబ్బందులు సృష్టిస్తున్నాయి.

దేశప్రజలు కేవలం రూ. 2,000 కోసం నానా తిప్పలు పడుతుంటే, రాజకీయపార్టీలు రకరకాలుగా మాట్లాడుతూ వారి ఆందోళన ఇంకా పెంచి పోషిస్తున్నాయి. ఆర్ధికశాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ ఒక్కరే మీడియా ముందుకి వచ్చి ఎప్పటికప్పుడు నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. దేశంలో ఇంత తీవ్రమైన సమస్య నెలకొని ఉంటే దానిపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నిన్నటి వరకు మాట్లాడనే లేదు. సాధారణ పరిస్థితులలో అయన మాట్లాడవలసిన అవసరం లేదు. కానీ ఈ సమస్య కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్నప్పుడు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పుడు, ఈ సమస్యని అధిగమించడానికి తాము ఎటువంటి చర్యలు చేపడుతున్నామో ప్రజలకి వివరించవలసిన బాధ్యత ఆయనపై ఉంది. ప్రతిపక్షాలు, ప్రజలు, మీడియా నుంచి తీవ్ర విమర్శలు చేస్తే కానీ ఆయనలో చలనం కలుగలేదు. అప్పుడు కూడా ఆయన మాట్లాడిన మాటలు సామాన్య ప్రజలకి ఏమాత్రం ఊరట నివ్వలేకపోయాయి. పైగా వారిని పరిహసిస్తున్నట్లుగా ఉన్నాయి. 

సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తాము ఎప్పటికప్పుడు తగిన ఉపశమన చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు ఏకధాటిగా పనిచేస్తూ ప్రజలకి సహకరిస్తున్నాయని చెప్పారు. దేశ అవసరాలకి సరిపడినన్ని కొత్తనోట్లు సిద్దంగా ఉన్నాయని, ఇంకా డిమాండ్ కి సరిపడా కొత్త నోట్లు ముద్రణ జరుగుతోందని చెప్పారు. గత రెండు వారాలుగా ప్రజలు బ్యాంకులు, ఎటిఎంల వద్ద కేవలం రూ.2,000 కోసం పడిగాపులు కాస్తుంటే, అన్ని బ్యాంకులు, ఎటిఎంలలో సరిపడినంత డబ్బు ఉందని ఉర్జిట్ పటేల్ చెప్పడం వారిని అపహాస్యం చేయడమే. త్వరలోనే పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకొంటాయని ఉర్జిట్ పటేల్ అన్నారు.