నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీతో సహా అనేక ప్రతిపక్ష పార్టీలు నేడు భారత్ బంద్ కి పిలుపునిచ్చాయి. దాని వలన సామాన్యప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కనుక ‘ఆక్రోస్ దివస్’ (ఆక్రోశ దినం) పేరిట నేడు బంద్ నిర్వహిస్తున్నాయి. ఎన్డీఏ మిత్రపక్షాలు, మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న తెరాస వంటి పార్టీలు ఈ బంద్ లో తాము పాల్గొనబోమని తేల్చి చెప్పాయి. కనుక నోట్ల రద్దు నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మాత్రమే బంద్ విజయవంతమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.
నోట్ల రద్దు కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాదిస్తున్న ప్రతిపక్షాలు, ఈ బంద్ తో వారిని ఇంకా ఇబ్బందులకి గురి చేస్తున్నాయని చెప్పక తప్పదు. నోట్ల రద్దుతో చాలా ఇబ్బందులు పడుతున్న ప్రజలు కూడా అది దేశహితం కోసం తీసుకొన్న మంచి సాహసోపేతమైన నిర్ణయమని భావిస్తున్నారు కనుక వారు ఈ బంద్ ని సమర్ధించకపోవచ్చు.
ప్రతిపక్షాలు నిజంగా సామాన్య ప్రజల కోసమే ఈ నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లయితే వారు ఈవిధంగా బంద్ నిర్వహించి సామాన్య ప్రజలని ఇంకా ఇబ్బంది పెట్టకుండా పార్లమెంటులో కేంద్రప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి ఉంటే సరిపోయేది కానీ వారు సామాన్య ప్రజల పేరు చెప్పి నల్లధనం దాచుకొన్నవారి తరపున బంద్ నిర్వహిస్తూ కేంద్రప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పక తప్పదు. ఎందుకంటే, ఇన్ని రోజుల తరువాత ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొన్నా దాని వలన సామాన్య ప్రజలకి కొత్తగా ఒరిగేదేమీ ఉండదు కానీ నల్లధనం దాచుకొన్నవారు డిశంబర్ 31లోగా దానిని బయటపెట్టవలసిన అవసరం ఉండదు. అందుకే నల్లకుభేరులు ప్రతిపక్షాలని ముసుగుగా వాడుకొంటుంటే, అవి సామాన్య ప్రజల కష్టాలని సాకుగా వాడుకొని ఈ బంద్ ద్వారా కేంద్రప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. డిశంబర్ 31వ తేదీ గడువు సమీపిస్తున్న కొద్దీ బహుశః నల్లకుభేరులు ఇంకా అనేక విధాలుగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచవచ్చు. రానున్న నెల రోజులలో అది ప్రజల కళ్ళకి స్పష్టంగా కనపడే అవకాశాలు కూడా ఉన్నాయి. తమ పేరుతో నల్లధనం పోగేసుకొన్నవారి కోసం ప్రతిపక్షాలు నిర్వహిస్తున్న ఈ బంద్ కి సామాన్య ప్రజలు మద్దతు ఇస్తారా లేదా అనేది ఈరోజు సాయంత్రానికే తెలుస్తుంది.