తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ఆంధ్రాలో అడుగుపెట్టబోతున్నారు..శుభకార్యాలకోసమో, రాజకీయ కార్యక్రమాల కోసమో కాదు..తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకొనేందుకు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే శ్రీవారికి రూ.5కోట్లుతో బంగారు ఆభరణాలు చేయించి ఇస్తానని కేసీఆర్ మొక్కుకొన్నారు. ఆయన కోరిక నెరవేరింది కనుక సుమారు 10 నెలల క్రితమే తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఖాతాలో తెరాస సర్కార్ తరపున రూ.5 కోట్లు జమా చేసి దానితో స్వామివారికి బంగారు ఆభరణాలు చేయించమని కోరారు.
ఆయన కోరుకోన్నట్లుగానే తిరుమల దేవస్థానం వారు స్వామివారికి రూ. 3,70,76,200 కోట్లతో 14.200 కేజీలు బరువున్న ఒక సాలిగ్రామ హారం, రూ. 1,21,41,150 కోట్లతో 4.650 కేజీలు బరువున్న ఒక కంటెని తయారుచేయించారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఇంతవరకు సమయం లేక తిరుమల స్వామివారి దర్శనానికి రాలేకపోవడంతో అవి తితిదే లాకర్లలోనే ఉండిపోయాయి. కనుక ఈ నెలాఖరులోగా ముఖ్యమంత్రి కేసీఆర్, కుటుంబ సభ్యులు, మంత్రులు అందరూ కలిసి ఒక ప్రత్యేక రైలులో తిరుపతి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని ఆ బంగారు ఆభరణాలు స్వామివారికి సమర్పించుకొని తమ మొక్కు తీర్చుకోవాలనుకొంటున్నారు. వారి తిరుపతి పర్యటన షెడ్యూల్ ఇంకా ఖరారు కావలసి ఉంది. ఈ నెలాఖరులోగా వెళ్ళడం ఖాయం అని తెలుస్తోంది.