ఎస్సై ఆత్మహత్య కి ప్రేమ వైఫల్యమే కారణమా?

ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా మొహిదీపట్నం నుంచి శంషాబాద్ వెళ్ళే పివి నరసింహారావు ఎక్స్ ప్రెస్ హైవేపై విధులు నిర్వహిస్తున్న శ్రీధర్ అనే ఎస్.ఐ. శనివారం ఉదయం 9.30 గంటలకి అక్కడే తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. అతను కొమురం భీమ జిల్లాలోని పెంచికల్ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ.గా పనిచేస్తున్నాడు. ప్రధాని పర్యటన సందర్భంగా ఎక్స్ ప్రెస్ హైవేపై డ్యూటీ చేస్తున్నాడు. సమీపంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది అది గుర్తించి తక్షణం అతనిని ఆసుపత్రికి తరలించారు కానీ అతను అప్పటికే మరణించాడు. అతను తన తుపాకిని నేరుగా తన గుండెకే గురిపెట్టుకొని కాల్చుకొన్నాడు.

అతను సందీప్ అనే ఒక హోంగార్డుతో తన మనసులో ఆలోచనలు చెప్పుకొనేవాడని తెలిసింది. సందీప్ చెప్పినదాని ప్రకారం శ్రీధర్ కొంత కాలంగా ఒక అమ్మాయిని చాలా గాడంగా ప్రేమిస్తున్నాడు కానీ ఆ అమ్మాయి శ్రీధర్ ప్రేమని అంగీకరించడం లేదు. శుక్రవారం రాత్రి కూడా అదే విషయం సందీప్ తో చెప్పుకొని బాధపడి, ఇక తనకి బ్రతకాలనే కోరిక లేదని ఆత్మహత్య చేసుకోవాలనుకొంటున్నట్లు చెప్పాడుట! సందీప్ ధైర్యం చెప్పి అటువంటి ఆలోచనలు చేయవద్దని గట్టిగా నచ్చ చెప్పాడుట! శ్రీధర్ ఆత్మహత్య చేసుకొనే ముందు చివరిసారిగా ఆ అమ్మాయికే ఫోన్ చేసినట్లు పోలీసులు చెపుతున్నారు. కనుక ప్రేమ వైఫల్యమే శ్రీధర్ మృతికి కారణంగా కనిపిస్తోంది.  

వరంగల్ జిల్లా పైడిపల్లికి చెందిన శ్రీధర్ పూర్తిపేరు చింతనమనేపల్లి శ్రీధర్. అతను 2012 బ్యాచ్ లో శిక్షణ ముగించుకొని పోలీస్ శాఖలో జేరాడు. ఈ నాలుగేళ్ళలోనే గుడి హత్నూర్, ముథోల్, కాగజ్ నగర్, మూడు పోలీస్ స్టేషన్లు మారి ప్రస్తుతం పెంచికల్ పోలీస్ స్టేషన్ లో ఎస్.ఐ.గా పనిచేస్తున్నాడు. కనుక ఇతర కారణాలు కూడా ఉండి ఉండవచ్చు. ప్రధాని భద్రత కోసం వచ్చిన ఒక యువ పోలీస్ అధికారి తనే ప్రాణాలు తీసుకోవడం చాలా బాధాకరమే.