తెలంగాణా జేయేసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ శుక్రవారం సంగారెడ్డిలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ, “నాపై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోను..అలాగే ప్రజా సమస్యలపై నా పోరాటాలు ఆపబోను” అని స్పష్టం చేశారు.
తను మేధావి ముసుగులో కాంగ్రెస్ పార్టీ తరపున తెరాస సర్కార్ పై బురద జల్లుతున్నారని తెరాస ఎంపి బాల్క సుమన్ చేసిన విమర్శలకి బదులిస్తూ “నా వెనుకా, ముందు ఏ రాజకీయ పార్టీ లేదు. నేను ఏ రాజకీయ పార్టీ కోసం పనిచేయడం లేదు. ప్రజల కోసమే పనిచేస్తున్నాను. రాష్ట్రంలో రైతులు, విద్యార్ధులు, ఉద్యోగులు ఇలాగ వివిధ వర్గాలకి చెందిన ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతున్నారు. వారి సమస్యల పరిష్కారం కోసమే నేను పోరాడుతున్నాను తప్ప రాజకీయ ఉద్దేశ్యంతోనో లేదా రాజకీయ పార్టీల తరపునో నేను పోరాడటం లేదు," అని అన్నారు.
"విద్యా, వైద్య, విద్యుత్, వ్యవసాయ తదితర రంగాలలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారం కోసం నేను ఉద్యమిస్తూనే ఉంటాను. ఇదివరకు తెలంగాణా ఉద్యమాలు చేసినప్పుడు ప్రజలు అందరూ మాకు ఏవిధంగా సహకరించారో ఇప్పుడూ ఈ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పోరాతలకి సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. త్వరలోనే తెలంగాణా జేయేసి అధికారిక వెబ్ సైట్ మరియు పత్రిక ప్రారంభించడానికి చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.