జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి భారత్ తరపున మాట్లాడుతారని ఆశించడం అత్యాశ కాదు. కానీ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా పాకిస్తాన్ని వెనకకేసుకువస్తూ భారత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఈరోజు చినాబ్ వ్యాలీలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ “పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ బాబు సొమ్మా? ప్రధాని నరేంద్ర మోడీకి నిజంగా ధైర్యం ఉంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని స్వాధీనం చేసుకొని చూపాలని” సవాలు విసిరారు. కాశ్మీర్ సమస్య భారత్, పాక్ రెండు దేశాలకి సంబంధించిన సమస్య అని, పాకిస్తాన్ ప్రమేయం లేకుండా కాశ్మీర్ సమస్య ఎన్నటికీ పరిష్కారం కాదని అన్నారు. భారత్ కి పాకిస్తాన్ తో చర్చలు జరుపడం మినహా మరో గత్యంతరం లేదని అన్నారు. భారత్-పాక్ ప్రభుత్వాల పంతాల వలన మద్యలో కాశ్మీర్ ప్రజలు నలిగిపోతున్నారని అన్నారు. ఇప్పటికైనా భారత ప్రభుత్వం పాకిస్తాన్ తో చర్చలు మొదలుపెట్టాలని ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేశారు.
పాకిస్తాన్ కి వంతపాడే ఇటువంటి వ్యక్తులు సున్నితమైన సరిహద్దు రాష్ట్రాన్ని ఇంతకాలం పాలిస్తునందునే, ఆ రాష్ట్రం లో వేర్పాటువాదం బలంగా వేళ్ళూనుకొంది. ముఖ్యమంత్రి హోదాలో పనిచేస్తున్న వ్యక్తులే తమకి మద్దతుగా మాట్లాడుతున్నప్పుడు, పాక్ పాలకులు, ఉగ్రవాదులు, వేర్పాటువాదులు రాష్ట్రంలో చిచ్చుపెట్టకుండా ఉంటారా?జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇటువంటి వేర్పాటువాదుల చేతిలోనే ఉన్నందునే నేడు ఆ రాష్ట్రంలో ప్రజలు భారత్ తో కంటే పాకిస్తాన్ తో ఎక్కువ మమేకం అవుతున్నారని చెప్పకతప్పదు.
కానీ భారత్, పాకిస్తాన్ లని ఒకసారి పోల్చి చూసుకొన్నట్లయితే, పాక్ పరిస్థితి ముఖ్యంగా దాని అధీనంలో ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం అవుతుంది. అటువంటి దేశంతోనే కలిసి ఉండాలని ఫరూక్ అబ్దుల్లా వంటి నేతలు ఎందుకు ఉబలాటపడుతున్నారో...పాకిస్తాన్ తో కలిసిపోయి ఏమి బావుకొందామనుకొంటున్నారో వారికే తెలియాలి.
ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన ఫరూక్ అబ్దుల్లా భారత ప్రభుత్వం పట్ల ఈవిధంగా అనుచితంగా, అవిధేయంగా మాట్లాడటం అయన అహంకారానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. అయినా భారత ప్రభుత్వం తనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోలేదనే ధీమా కారణంగానే ఆయన ఆవిధంగా మాట్లాడగలిగారని చెప్పక తప్పదు.