ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు పాకిస్తాన్ కి చాలా ఆగ్రహం, ఆందోళన కలిగించే విషయం ఒకటి చెప్పారు. భారత్ లో నుంచి పాకిస్తాన్ లోకి ప్రవహిస్తున్న సింధు నది నీటిని భారత్ అవసరాలకి మళ్ళించుకోవాలనుకొంటున్నట్లు ప్రకటించారు. దీనికోసం ఉభయదేశాల మద్య జరిగిన ఇండస్ ట్రీటీని పునః సమీక్షించాలనుకొంటున్నట్లు చెప్పారు. ఈ విషయం ఆయన ఈరోజు మధ్యాహ్నం పంజాబ్ లోని బటిండాలో జరిగిన ఒక బహిరంగ సభలో చెప్పారు. ఆ నీటిపై భారత్ కి పూర్తి హక్కు ఉందని దానిని పంజాబ్ లో పొలాలకి పారిస్తామని మోడీ చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఉద్దేశ్యించి “మీరు (పాక్ ప్రభుత్వం) ఎప్పుడూ భారత్ తో యుద్ధం చేయాలని ఆలోచిస్తుంటారు. మాతో యుద్ధం చేయాలని ఆలోచించేబదులు మీ దేశంలో పేదరికంపై, అవినీతిపై, నల్లధనం పై యుద్ధం చేస్తే మీ దేశానికి ఎంతో మేలు కలుగుతుంది. పాక్ ప్రభుత్వం తీరు సరైనదా కాదా? దాని వలన దేశానికి ఏమైనా మేలు కలుగుతోందా, లేదా? అని పాక్ ప్రజలు కూడా ఆలోచించుకొంటే మంచిది,” అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి చురకలు వేస్తూ, “గతంలో ఎన్నికలు వస్తున్నాయంటే దేశంలో ఎక్కడ పడితే అక్కడ జోరుగా శంఖుస్థాపనలు జరుగుతుండేవి. చివరికి ఆ రాళ్ళూ మాత్రమే మిగిలేవి తప్ప ఏనాడూ ఆ పని పూర్తి చేసిన దాఖలాలు లేవు. నాకు ఎన్నికలలో గెలుస్తామా లేదా అనే ఆలోచనే లేదు. మా ప్రభుత్వం శంఖుస్థాపన చేసిన ప్రతీ పని మా ప్రభుత్వ హయంలోనే పూర్తి కావాలని కోరుకొంటాను. ఈరోజు ఇక్కడ ఎయిమ్స్ ఆసుపత్రికి శంఖుస్థాపన చేస్తున్నాను. దీనిని పూర్తిచేసి చూపించే బాధ్యత నాదే,” అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.