
తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం హైదరాబాద్ నగరంలో ఉప్పల్-నారపల్లి మద్య నిర్మాణంలో ఉన్న ఎలివేటడ్ కారిడార్‌ని పరిశీలించారు. ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు బండారు లక్ష్మారెడ్డి, రోడ్లు, భవనాల శాఖ, జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఈ ఎలివేటడ్ కారిడార్ నిర్మాణ పనులు చేస్తున్న గాయత్రి కంపెనీ మద్యలో తప్పుకోవడం వలన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దీని వలన స్థానిక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వానికి తెలుసు అందుకే వెంటనే మరో సంస్థకు పనులు అప్పగించాము.
ఎట్టి పరిస్థితులలో ఈ ఏడాది దసరా నాటికి ఎలివేటడ్ కారిడార్ నిర్మాణ పనులు పూర్తిచేయాలని గడువు విధించి, ఆ సంస్థ ఇందుకు అంగీకరించిన తర్వాతే పనులు అప్పగించాము. ఇది పూర్తయ్యేవరకు నేను స్వయంగా దీని పురోగతిని పర్యవేక్షిస్తాను. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించి దసరా నాటికి ఎలివేటడ్ కారిడార్ ప్రజలకు అందుబాటులో తెస్తానని హామీ ఇస్తున్నాను,” అని అన్నారు.
గత పదేళ్ళలో ఒక్క హైదరాబాద్ నగరంలోనే 35కి పైగా ఫ్లై ఓవర్లు నిర్మించబడ్డాయి. కానీ 2017లో ప్రారంభించిన ఈ ఉప్పల్-నారపల్లి ఎలివేటడ్ కారిడార్ మాత్రం నేటికీ పూర్తికాలేదు. మంత్రి హామీ ఇచ్చినట్లు కనీసం దసరాకైనా పూర్తయి అందుబాటులోకి వస్తే ప్రజలు చాలా సంతోషిస్తారు.