
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు లీగల్ నోటీస్ పంపారు. హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్ధి రోహిత్ వేముల కుల వివక్ష, వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవడానికి రామచందర్ రావు కారకుడని, బడుగు బలహీన వర్గాల పట్ల చులకన భావం కలిగిన ఆయనకు బీజేపీ అధిష్టానం రాష్ట్ర అధ్యక్షుడు పదవి కట్టబెట్టి సత్కరించిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. కనుక కనుక ఆయన నియామకంపై బీజేపీ అధిష్టానం పునరాలోచన చేయాలని సూచించారు.
భట్టి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన రామచందర్ రావు ఆయనకు లీగల్ నోటీస్ పంపారు. మూడు రోజులలోగా ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేకుంటే రూ.25 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని, క్రిమినల్ కేసు కూడా వేస్తానని ఆ నోటీసులో భట్టి విక్రమార్కని హెచ్చరించారు. ఈ నోటీసుపై భట్టి విక్రమార్క ఇంకా స్పందించాల్సి ఉంది.