ప్రతిపక్షాలు అందుకే రాద్దాంతం చేస్తున్నాయి: మోడీ

“నోట్ల రద్దు ఒక తొందరపాటు నిర్ణయం. దాని గురించి మేము అడుగుతున్న ప్రశ్నలకి ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో ఎందుకు సమాధానం చెప్పడం లేదు?” అంటూ నిలదీస్తున్న ప్రతిపక్షాలకి ఇవ్వాళ్ళ మోడీ చాలా ఘాటుగా జవాబిచ్చారు. 

ఈరోజు రాజ్యంగదినం వేడుకల సందర్భంగా మాట్లాడుతూ, “మేము ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండా నోట్ల రద్దు చేయడం చాలా తొందరపాటు నిర్ణయమని చాలా మంది మమ్మల్ని విమర్శిస్తున్నారు. కానీ ప్రతిపక్షాలకి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడానికి మేము అవకాశం ఇవ్వనందుకే వారు మాపై విమర్శలు గుప్పిస్తున్నారని మేము భావిస్తున్నాము. అకస్మాత్తుగా నోట్ల రద్దు చేయడంతో తీవ్ర దిగ్బ్రాంతి చెందిన ప్రతిపక్షాలు దాని నుంచి తేరుకొని మా ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసుకోలేదని, కనుక ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని వాదిస్తున్నాయి. ఒకవేళ మేము వారికి 72 గంటలు సమయం ఇచ్చినా కూడా వారు సర్దుకోలేరు కనుక అప్పుడు కూడా వారు మమ్మల్ని విమర్శించకుండా ఉండరు,” అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.