రేవంత్ రెడ్డి ఓ పిట్టలదొర!

“ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్న రేవంత్ రెడ్డి ఒక పిట్టలదొర.. చంద్రబాబు నాయుడుకి అలాంటి పిట్టలదొరలని తయారుచేసి తన ప్రత్యర్దులపైకి వదలడం అలవాటే. ముఖ్యమంత్రి కోసం కట్టిన ఆ ఇల్లు (ప్రగతి భవన్) ఆయన స్వంతమేమీ కాదు. అధికార నివాసం మాత్రమే. దాని గురించి కూడా రేవంత్ రెడ్డి వంటివారు నోటికి వచ్చినట్లు  విమర్శలు చేయడం చాలా విచారకరం,” అని తెరాసలో ఉన్న కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. 

నోట్ల రద్దు వ్యవహారంపై కూడా గుత్తా చాల ఘాటుగా స్పందించారు. “అది తెదేపా, భాజపాలు కలిసి చేసిన పెద్ద కుట్ర. ప్రధాని నరేంద్ర మోడీకి తనే ఆ సలహా ఇచ్చానని, తన వలనే ఆయన ఈ నిర్ణయం అమలుచేశారని చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకోవడమే అందుకు నిదర్శనం. నోట్ల రద్దు చేయమని ప్రధానికి చెప్పిన చంద్రబాబు నాయుడు, దాని వలన ఎటువంటి సమస్యలు తలెత్తుతాయో, వాటిని ఏవిధంగా ఎదుర్కోవాలో కూడా చెప్పి ఉండి ఉంటే బాగుండేది కదా? కానీ సమస్యలు ఎదురవగానే ఇప్పుడు ఆయన కూడా అందరితో కలిసి కేంద్రప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు,” అని ఎద్దేవా చేశారు.      

“నోట్ల రద్దుతో దేశంలో నల్లధనం ఉన్నవారు మాత్రమే నష్టపోతారని కేంద్రం గొప్పలు చెప్పుకొంటోంది. కానీ దాని వలన వారి కంటే సామాన్య ప్రజలే ఎక్కువగా నష్టపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండా హడావుడిగా ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని కేంద్రప్రభుత్వం చాలా పొరపాటు చేసింది,” అని గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు.