మేడిగడ్డ బ్యారేజీ 85 గేట్లు ఎత్తివేసి నీళ్ళను దిగువకు విడిచిపెట్టేస్తుండటంతో సుమారు 75,000 క్యూసెక్కుల నీళ్ళు వృధాగా పోతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కన్నేపల్లి పంప్ హౌసులో మోటర్లు ఆన్ చేసి రోజుకి 2 టీఎంసీల నీటిని అన్నారం, సుందిళ్ళలో ఎత్తి పోసుకోవచ్చు కదా? అన్నారు. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కు అయ్యి నీటిని దిగువకు విడిచిపెట్టేస్తున్నారని ఆరోపించారు.
హరీష్ రావు వ్యాఖ్యలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి స్పందిస్తూ, “కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలను పరిశీలించిన నేషనల్ డామ్ సేఫ్టీ ఆధారిటీ (ఎన్‌డీఎస్ఎ) నిపుణులు వాటిలో నీటిని నిలువ చేస్తే బ్యారేజీలు కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. హరీష్ రావు కంటే వారికి చాలా జ్ఞానం ఉందనే నేను భావిస్తున్నాను.
కానీ ఆయన మాటలు విని మేము బ్యారేజీలలో నీళ్ళు నింపితే, అవి కూలిపోతే దిగువన ఉన్న 44 గ్రామాలు కొట్టుకుపోతాయి. భద్రాచలం ఆలయానికి కూడా ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే మూడు బ్యారేజీలలో నీళ్ళు నింపడం లేదు తప్ప మాకు ఎటువంటి రాజకీయ దురుదేశ్యాలు లేవు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నప్పుడే ఎన్‌డీఎస్ఎ నిపుణులు పలుమార్లు రాష్ట్రానికి వచ్చి నిర్మాణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేకుంటే నీళ్ళు నింపినప్పుడు కూలిపోయే ప్రమాదం ఉంటుందని పదేపదే అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కానీ మూడేళ్ళలోనే కాళేశ్వరం కట్టించేశామని గొప్పలు చెప్పుకోవడానికి వారి హెచ్చరికలను ఖాతరు చేయకుండా కట్టించేశారు. ఎన్‌డీఎస్ఎ హెచ్చరించినట్లే కేసీఆర్ అధికారంలో ఉండగానే మేడిగడ్డ బ్యారేజీ క్రుంగిపోయింది. అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు గోడలు బీటలు వారి ఎందుకు పనికిరాకుండా పోయాయి.
ఈ విషయాలన్నీ హరీష్ రావుకి తెలియవనుకోను. అయినా రాజకీయ దురుదేశ్యంతో మా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు,” అని ఉత్తమ కుమార్ రెడ్డి అని ఘాటుగా బదులిచ్చారు.