కేసీఆర్ భవనం సరే...డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ మాటేమిటి?

ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం 9ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.50 కోట్లు వ్యయంతో నిర్మించబడిన నూతన అధికారిక నివాసంలోకి నిన్న గృహాప్రవేశం చేశారు. ఆ సందర్భంగా తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిపై విమర్శలు చేశారు. 

రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టుకొని ఇంద్రభవనం వంటి ఇల్లు కట్టుకొన్నారు. కానీ ఎన్నికల సమయంలో నిరుపేదలకి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టిస్తామన్న హామీని ఇంతవరకు నిలబెట్టుకోలేదు. అలాగే గ్రేటర్ ఎన్నికలకి ముందు నగరంలో క్రీష్టియన్స్ కోసం రూ.10 కోట్లుతో కట్టిస్తానన్న భవన నిర్మాణ పనులు ఇంతవరకు మొదలుపెట్టలేదు. ఇంకా గిరిజన, కురుమలు, వివిధ కులస్థుల కోసం వేర్వేరుగా సామాజిక భవనాలని నిర్మిస్తామని హామీ ఇచ్చారు వాటినీ ఇంతవరకు మొదలుపెట్టనే లేదు. ఇప్పటికైనా వాటి నిర్మాణాలు మొదలుపెట్టకపోతే ఆయా వర్గాల ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతాము,” అని హెచ్చరించారు.   

తెలంగాణా ఏర్పడిన తరువాత కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తెరాసకి పట్టు ఉండేది కాదు. దానికి కారణాలు అందరికీ తెలుసు. అప్పటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్ ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని అనేక రకాల వ్యూహాలు అమలు చేశారు. వాటిలో వివిద కులాలు, మతాలకి సామాజిక భవనాలకి శంఖుస్థాపనలు, నగరంలో పేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం కూడా ఒకటని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి అధికార నివాసాన్ని యుద్ద ప్రాతిపదికన నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భవనాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం కూడా పూర్తి చేసి ఉండి ఉంటే నేడు ఇటువంటి విమర్శలు వినవలసి వచ్చేది కాదు కదా!