ప్రధాని మోడీ నేడు హైదరాబాద్ పర్యటన

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఇంకా అనేకమంది కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. ప్రతీ ఏటా దేశంలో జాతీయ పోలీస్ అకాడమీ సదస్సులు నిర్వహిస్తుంటారు. ఈసారి హైదరాబాద్ లోగల  సర్దార్ వల్లబ్ బాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ 51వ వార్షిక సదస్సులో పాల్గొనడానికి వారు వస్తున్నారు. 

ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు మధ్యాహ్నం చండీఘడ్ లో ఒక కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 6గంటలకి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకొంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా శివారం పల్లిలోగల జాతీయ పోలీస్ అకాడమీకి చేరుకొంటారు. హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ మధ్యాహ్నం 2గంటలకే అక్కడికి చేరుకొంటారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఇవ్వాళ్ళ సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు పోలీస్ అకాడమీలోనే బస చేస్తారు. ఈరోజు రాత్రి పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి విందు భోజనం చేస్తారు. రేపు ఉదయం 6 గంటలకి అకాడమీ ఆవరణలో మంత్రులు, అధికారులతో కలిసి యోగాబ్యాసం కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత కొంతసేపు విశ్రాంతి తీసుకొని, అకాడమీ వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఆ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పోలీస్ ఉన్నతాధికారులకి, ఇంటలిజెన్స్ ఉన్నతాధికారులకి పతకాలు అందజేస్తారు. శనివారం సాయంత్రం 6గంటలకి మళ్ళీ శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకొని డిల్లీ తిరిగి వెళతారు.       

 ప్రధాని, కేంద్రమంత్రుల పర్యటన సందర్భంగా విమానాశ్రయం నుంచి అకాడమీ వరకు గల కిషన్ గూడ, కామం చెర్వు, మధురా నగర్ ఆర్.బి నగర్, కొత్వాల్ గూడా చౌరస్తా, భారత చౌరస్తా, సాతంరాయి, గగన్ పహాడ్ ఓల్డ్ కర్నూల్ చౌరస్తా రోడ్డు మార్గం అంతటా బారీగా పోలీసులని నియమించి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.