
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాశమైలారంలో సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై ఇప్పటికే తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మంత్రులను వెంటబెట్టుకొని అక్కడకు వెళ్ళి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. ప్రభుత్వం తరపున బాధిత కుంటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. సిగాచీ కంపెనీ యాజమాన్యం తరపున ఒక్కొక్కరికీ కోటి రూపాయలు నష్టపరిహారం అందజేస్తామని చెప్పారు. క్షతగాత్రులకు చికిత్స, ఖర్చులు, బాధిత కుంటుంబాల పిల్లల చదువులకు తోడ్పడుతామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ ప్రమాదంపై స్పందిస్తూ, “ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంనే జరిగిందని నేను భావిస్తున్నాను. ఎప్పటికప్పుడు ఫ్యాక్టరీలు తనికీలు చేయిస్తూ సరైన చర్యలు తీసుకొని ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేదే కాదు... 40 మంది ప్రాణాలు పోయేవే కావు.
ఏది ఏమైనప్పటికీ దీనిపై లోతుగా విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ ప్రమాదవశాత్తు జరిగిందే అయితే ఒక్కొక్క బాధిత కుంటుంబాలకు కోటి రూపాయలు చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలి. గాయపడి మళ్ళీ పనిచేసుకోలేనివారిని ప్రభుత్వమే ఆదుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఎప్పటికప్పుడు ఫ్యాక్టరీలలో తనికీలు చేయిస్తే మళ్ళీ ఇటువంటి ప్రమాదాలు జరుగకుండా నివారించవచ్చు,” అని అన్నారు.