
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలోణి సిగాచి కెమికల్ ఫ్యాక్టరీని సిఎం రేవంత్ రెడ్డి ఈరోజు మంత్రులతో కలిసి సందర్శించారు. అక్కడే కంపెనీ యాజమాన్యం, మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులు, కార్మికులతో మాట్లాడి ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం బాధిత కుటుంబాలతో మాట్లాడుతూ, “ఈ ప్రమాదానికి బాధ్యులైన ప్రతీ ఒక్కరిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాము. ఈ ప్రమాదానికి కంపెనీ యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లిస్తాము.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. వారి పిల్లలని చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. భవిష్యత్‌లో మళ్ళీ ఇటువంటి ప్రమాదాలు జరుగకుండా నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాము,” అని చెప్పారు.
సిఎం రేవంత్ రెడ్డి మంత్రులను సిగాచి కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికీ కోటి రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇప్పించమని ఆదేశించారు.
ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 36కి పెరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.