తెలంగాణ బీజేపి అధ్యక్షుడుగా ఎన్‌ రామచందర్ రావు

తెలంగాణ బీజేపి అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో నామినేషన్స్ పర్వం సోమవారం సాయంత్రం ముగిసింది. మాజీ ఎమ్మెల్సీ ఎన్‌ రామచందర్ రావు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ఈరోజు ప్రకటించబోతున్నారు. 

ఈటల రాజేందర్‌, బండి సంజయ్‌, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, రాజాసింగ్ అధ్యక్ష పదవి రేసులో ఉన్నప్పటికీ బీజేపి అధిష్టానం ఆర్‌ఎస్ఎస్ మూలాలున్న సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌ రామచందర్ రావుకి మొగ్గు చూపింది. 

కనుక రేసులో ఉన్నవారితో అధిష్టానం తరపు పెద్దలు ముందుగానే మాట్లాడి ఒప్పించడంతో ఒక్క రాజాసింగ్ తప్ప మరెవరూ నామినేషన్స్ వేసేందుకు ముందుకు రాలేదు. తనని నామినేషన్ వేయకుండా బీజేపి పెద్దలు అడ్డుకున్నారంటూ రాజాసింగ్‌ అక్కడికక్కడే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 

బండి సంజయ్‌, డీకే అరుణ ఎన్‌ రామచందర్ రావు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. అధిష్టానం నిర్ణయంపై ఈటల రాజేందర్‌, రఘునందన్ రావు,ధర్మపురి అరవింద్ ఇంకా స్పందించాల్సి ఉంది. 

ఎన్‌ రామచందర్ రావు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నికైనట్లు ప్రకటించడం లాంఛనప్రాయమే. 

ఆయన ఈ పదవిలో మూడేళ్ళుంటారు. కనుక ఎన్‌ రామచందర్ రావు నాయకత్వంలోనే బీజేపి వచ్చే ఎన్నికలకు వెళ్ళబోతోందన్న మాట!