
తెలంగాణ బీజేపి అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ అంతా ఓ భూటకమని, అధిష్టానం ముందే ఒకరి పేరు ఖరారు చేసి ఎన్నికలంటూ డ్రామా ఆడుతోందని బీజేపి ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. “ఎన్నికలన్నారు కనుకనే నేను నామినేషన్ ఫారం తీసుకున్నాను. నాకు ముగ్గురు కార్యవర్గ సభ్యులు నాకు మద్దతు ఇచ్చారు. కనుక నామినేషన్ వేసేందుకు వస్తే వారిని బీజేపి పెద్దలు ఫోన్లో బెదిరించి భయపెట్టి వెనక్కువెళ్ళిపోయేలా చేశారు. కనుక నామినేషన్ వేయలేకపోయాను. ఈ మాత్రం దానికి ఎన్నికలంటూ డ్రామాలు దేనికి? అధిష్టానం నేరుగా రాష్ట్ర అధ్యక్షుడు పేరు ప్రకటిస్తే సరిపోయేది కదా?
తెలంగాణలో ఎప్పటికైనా బీజేపి అధికారంలోకి వస్తుందని, రావాలని నేను కోరుకుంటున్నాను. కానీ పార్టీలోనే రావద్దని కోరుకునేవారి సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. నేను, నా కుటుంబానికి ఉగ్రవాదుల నుంచి ప్రాణహాని ఉంది. అయినా లెక్క చేయకుండా పార్టీ కోసం పనిచేస్తుంటే ఈవిదంగా అవమానించారు. ఇలాంటి పార్టీలో నేను ఇక కొనసాగలేను. పార్టీకి రాజీనామా చేస్తున్నాను. నా రాజీనామా ఆమోదించి, నన్ను శాసనసభ నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతూ మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి లేఖ ఇచ్చాను,” అని అన్నారు.