కాంగ్రెస్‌, బిఆర్ఎస్‌లకు తెలంగాణ ఓ ఏటీఎం: అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించి వెళ్ళారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన సభలో ప్రసంగిస్తూ, “ప్రధాని మోడీ ఏదైనా మాట ఇస్తే అది తప్పకుండా నెరవేరుస్తారు. పసుపు బోర్డు కోసం ఇక్కడి రైతులు 40 ఏళ్ళు పోరాడారు. మా ఎంపీ ధర్మపురి అరవింద్ పట్టుబట్టి ప్రధాని మోడీని ఒప్పించి పసుపు బోర్డు ఏర్పాటు చేయించుకున్నారు. భారత్‌ ఆర్గానిక్ లిమిటెడ్, భారత్‌ ఎక్స్‌పోర్టు లిమిటెడ్ నిజామాబాద్‌లోనే ఏర్పాటు కాబోతున్నాయి. కనుక ఇకపై నిజామాబాద్‌ నుంచే అమెరికా, యూరప్ దేశాలకు పసుపు ఎగుమతి చేయవచ్చు,” అని అన్నారు. 

ఈ సందర్భంగా ఆయన సిఎం రేవంత్ రెడ్డికి సున్నితంగా ఓ హెచ్చరిక కూడా చేశారు. “దేశంలో సుమారు 40 వేల మందికి పైగా మావోయిస్టులు హత్యలు చేశారు. ప్రజలకు, ప్రభుత్వాలకు, దేశానికి పెద్ద బెడదగా మారిన మావోయిస్టులని ఏరి పారేస్తున్నాము. ఇప్పటికే 10 వేల మంది లొంగిపోయారు. మిగిలినవారు కూడా 2026, మార్చి 30లోగా లొంగిపోకపోతే వారికి చావు తప్ప వేరే గత్యంతరం ఉండదు. దేశాన్ని పట్టి పీడిస్తున్న మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం ఏరిపారేస్తుంటే, తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వారికి ఆశ్రయం కల్పించవద్దని సిఎం రేవంత్ రెడ్డికి సూచిస్తున్నాను,” అని అమిత్ షా అన్నారు.       

ఇదివరకు కేసీఆర్‌ కుటుంబం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్‌ అధిష్టానం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని తింటున్నాయని అమిత్ షా ఆరోపించారు. ఈసారి తెలంగాణలో బీజేపి తప్పకుండా అధికారంలోకి వచ్చి ‘డబుల్ ఇంజన్ సర్కార్’ ఏర్పడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అమిత్ షా అన్నారు.