అందరికీ ఇస్తారు.. నాకెందుకు ఇవ్వరు నోటీస్?

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో పలువురు రాజకీయ నాయకులకు సిట్ నోటీసులు పంపించి వారి వాంగ్మూలాలు తీసుకుంటుండటంపై బీజేపి ఎంపీ రఘునందన్ రావు చాలా భిన్నంగా స్పందించారు.

ఈరోజు ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ అసలు ఈ కేసులో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా? అని అనుమానం కలుగుతోంది. ఈ కేసు విచారణ మొదలుపెట్టి అప్పుడే ఏడాదవుతోంది. కానీ ఇంతవరకు మీరు ఏం కనిపెట్టారు? ఎవరిపై చర్యలు తీసుకున్నారు? 

2020, నవంబర్‌లో దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనే కేసీఆర్‌ ప్రభుత్వం నా ఫోన్‌ ట్యాపింగ్ చేస్తోందని నేను కనీసం ఓ డజను సార్లు అప్పటి డీజీపీకి పిర్యాదు చేశాను. కనుక ఈ కేసులో మొట్ట మొదటి బాధితుడిని నేను. నన్ను విచారణకు పిలవకుండా ఈ కేసుతో సంబంధంలేని ఎవరెవరినో పిలుస్తున్నారు.

ఇదేమైన గాంధీ భవన్‌కి, కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సంబందించిన కేసా? పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌ గౌడ్‌కి ఈ కేసుకి సంబంధం ఏమిటి? కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని, సిట్ అధికారులను సూటిగా నేను ప్రశ్నిస్తున్నా.. మీరు కేసు విచారణ జరుపుతున్నారా లేకా డైలీ సీరియల్ నడుపుతున్నారా?ఇంతవరకు నాకు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? నన్ను ఎందుకు పిలవలేదు? ఫోన్ ట్యాపింగ్‌ కేసు గురించి నన్ను ఎందుకు అడగలేదు?”అని ప్రశ్నించారు. నిజమే కదా?