నిజామాబాద్‌లో పసుపు బోర్డుకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత బోర్డు కార్యాలయం ఏర్పాటు చేసి, అధికారులు, ఉద్యోగులను నియమించారు. పసుపు బోర్డు పనిచేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినందున కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ఆదివారం నిజామాబాద్ వచ్చి ప్రారంభోత్సవం చేయబోతున్నారు.
జిల్లాలో పసుపు రైతుల 40 ఏళ్ళ ఈ కలని బీజేపి ఎంపీ ధర్మపురి అరవింద్ కృషితో సాకారం అయ్యిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు అయినందున ఇకపై జిల్లాతో సహా చుట్టుపక్కల జిల్లాలు, రాష్ట్రాలలో పసుపు పండించే రైతులకు చాలా ప్రయోజనం కలుగుతుందన్నారు.
కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ నేతలకు తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని విమర్శించడం దురలవాటుగా మారిందని, కానీ పసుపు బోర్డు ఏర్పాటుతో సహా రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ నిధులు, సహాయసహకారాలతోనే జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
అమిత్ షా నిజామాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు జిల్లా కేంద్రంలో దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ విగ్రహం ఆవిష్కరించి రైతు సమ్మేళనంలో పాల్గొంటారు.