ఆలూ లేదూ చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఏపీలో కూటమి ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు పేరుతో ఆ రాష్ట్ర ప్రజలను ఆకట్టుకోవాలని తిప్పలు పడుతుంటే, ఆ పేరుతో ఇక్కడ తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీల మద్య జోరుగా రాజకీయ చదరంగం సాగుతోంది.
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడంలో తమకి మాత్రమే శ్రద్ద ఉందని బిఆర్ఎస్ పార్టీ చెప్పుకునేందుకు బనకచర్లని భుజానికి ఎత్తుకొని ఆ పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని ప్రయత్నిస్తోంది. ఈ విషయం పసిగట్టిన సిఎం రేవంత్ రెడ్డి “కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పడుకొని రాజకీయాలు చేయడం కాదు దమ్ముంటే శాసనసభకు వచ్చి మాట్లాడు. ముఖాముఖీ తేల్చుకుందాం,” అని సవాలు విసిరారు.
కల్వకుంట్ల కవిత తండ్రిపై తిరుగుబాటు చేసి రాష్ట్ర రాజకీయాలలో ఏకాకిగా మారడంతో మళ్ళీ ఆయనని ప్రసన్నం చేసుకునేందుకు ఈ అంశంపై సిఎం రేవంత్ రెడ్డికి ఘాటుగా జవాబు చెప్పారు.
“కేసీఆర్‌కి దమ్ముంది కనుకనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ విషయం కాంగ్రెస్ అధిష్టానానికి కూడా బాగా తెలుసు. కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు అన్యాయం చేయరని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ సిఎం రేవంత్ రెడ్డి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని ఆహ్వానించి ప్రజా భవన్‌లో హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి నీళ్ళని గిఫ్ట్ ప్యాక్ చేసి పంపించారు. శాసనసభ సమావేశాలు పెట్టండి. మీరిచ్చిన ప్రతీ హామీ గురించి శాసనసభలో చర్చిద్దాం,” అని ప్రతి సవాలు విసిరారు.
అయితే తన తండ్రి కేసీఆర్ శాసనసభకు మొహం చాటేస్తున్నారని తెలిసి ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలు పెట్టండి వస్తాం సిఎం రేవంత్ రెడ్డిని నిలదీస్తాం అని కల్వకుంట్ల కవిత ప్రతి సవాలు విసరడం కేసీఆర్‌కి చాలా ఇబ్బందికరంగా మారుతుందనే విషయం కల్వకుంట్ల కవిత మరిచిపోయినట్లున్నారు. అయినా కేసీఆర్‌ని శాసనసభ సమావేశాలకు రమ్మనని సిఎం రేవంత్ రెడ్డి సవాలు చేస్తే అది తప్పేలా అవుతుంది?
కేసీఆర్ సత్తా ఏంటో ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు తెలుసు... అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రేవంత్ రెడ్డి వచ్చాకే చంద్రబాబుతో మీటింగ్ పెట్టుకొని బిర్యానీ పెట్టి మరీ గోదావరి నీళ్లను అప్పజెప్పారు.#Kavitha #KCR pic.twitter.com/TohQhkeMTA
— Telugu360 (@Telugu360) June 25, 2025