సీపీఎం మద్దతు కోరిన కల్వకుంట్ల కవిత

బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం హైదరాబాద్‌లో సీపీఎం కార్యాలయానికి వెళ్ళి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో భేటీ అయ్యారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతంకి పెంచాలంటూ తాను మొదలుపెట్టిన ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. సమాజంలో బీసీలు కూడా మిగిలిన వర్గాలతో సమానంగా పైకి ఎదగాలంటే వారికి తప్పనిసరిగా 42 శాతం రిజర్వేషన్స్ కల్పించడం చాలా అవసరమని అన్నారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం దీని కోసం శాసనసభలో తీర్మానం చేసి ఆమోదం కోసం ఢిల్లీకి పంపించి చేతులు దులుపుకుందని, బీజేపి నేతలు ఎవరూ కూడా బీసీ రిజర్వేషన్స్ పెంపు గురించి మాట్లాడటం లేదని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. 

కనుక కేంద్రంతో కోట్లాది ఒత్తిడి తెస్తేనే బీసీ రిజర్వేషన్స్ పెరుగుతాయని కల్వకుంట్ల కవిత అన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జూలై 17 తేదీన రైల్ రోకో నిర్వహించాలనుకుంటున్నామని కల్వకుంట్ల కవిత చెప్పారు. 

వామపక్షాలు కూడా తమతో కలిసి వస్తే కేంద్రంపై ఒత్తిడి తేగలుగుతామని కల్వకుంట్ల కవిత అన్నారు. పార్టీలో చర్చించుకున్న తర్వాత సమాధానం చెపుతామని జాన్ వెస్లీ అన్నారు. 

వామపక్షాలు కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమిలో ఉన్నాయి. కానీ కల్వకుంట్ల కవిత రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీతో కూడా పోరాడుతున్నారు. పైగా గతంలో ఆమె తండ్రి కేసీఆర్‌ మునుగోడు ఉప ఎన్నికలలో వామపక్షాలను మద్దతు తీసుకొని వాడుకొని శాసనసభ ఎన్నికల సమయంలో హ్యాండ్ ఇచ్చారు. రేపు ఆమె కూడా అలాగే చేయవచ్చు. కనుక వామపక్షాలు ఆమెకు సహకరిస్తాయో లేదో?