కౌశిక్ రెడ్డి రిమాండ్‌.. వెంటనే బెయిల్‌

క్వారీ యాజమానిని బెదిరించిన కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కాజీపేట రైల్వేకోర్టు 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్‌ విధించింది. పోలీసులు శనివారం సాయంత్రం ఆయనని ఖమ్మం జైలుకి తరలించేందుకు సిద్దమవుతుండగా, అదే కోర్టు ఆయన రిమాండ్‌ రద్దు చేసి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేయడం విశేషం.  

ఆయనకు బెయిల్‌ లభించిందని తెలియడంతో పోలీసులు ఆయనని విడిచిపెట్టారు. నిబందనల ప్రకారం 41 ఏ నోటీస్ ఇవ్వకుండా పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్ట్‌ చేశారని, కనుక రిమాండ్‌ విధించడం సరికాదని ఆయన తరపు న్యాయవాదులు వాదనలతో ఏకీభవించిన రైల్వేకోర్టు వెంటనే బెయిల్‌ మంజూరు చేసింది. 

కేసేమిటంటే, కమలాపూర్ మండలంలో వంగపల్లిలో మనోజ్ రెడ్డి అనే వ్యక్తి గ్రానైట్ క్వారీ నిర్వహిస్తున్నారు. అది తన నియోజకవర్గం పరిధిలోనే ఉంది కనుక రూ.50 లక్షలు ఇవ్వాలని హుజూరాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తనను బెదిరించారని వరంగల్ సుబేదారీ పోలీస్ స్టేషన్‌లో మనోజ్ రెడ్డి పిర్యాదు చేశారు. 

ఆయన పిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్స్: 308 (2), 308(4), 352 ప్రకారం కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. శనివారం తెల్లవారుజామున ఆయనని శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్‌ చేసి వైద్య పరీక్షలు చేసి కాజీపేట రైల్వేకోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్‌, బెయిల్‌ పరిణామాలు జరిగాయి. 

అనతరం ఆయన కోర్టు బయట మీడియాతో మాట్లాడుతూ, “నన్ను జైల్లో పెట్టేందుకు సిఎం రేవంత్ రెడ్డి చేసిన కుట్రలు ఫలించలేదు. రేపు తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి కాంగ్రెస్‌ మంత్రులు ఇసుక దందాలు, పేదల భూకబ్జాలకు సంబందించి సాక్ష్యాధారాలతో బయటపెడతాను. 

ఇకపై నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏకే 47 తుపాకీలా కాంగ్రెస్‌ మంత్రుల అక్రమాలు బయటపెడుతూనే ఉంటాను. హామీల అమలు గురించి నిలదీస్తూనే ఉంటాను,” అని పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.