ఫోన్ ట్యాపింగ్: అనేక కుటుంబాలు నష్టపోయాయి

కేంద్ర సహాయ మంత్రి, బీజేపి ఎంపీ బండి సంజయ్‌ ఈరోజు కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని నేను ఆనాడే చెప్పాను. హైదరాబాద్‌లో సిఎంవో, సిరిసిల్లా కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్‌లు జరిగాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలన్నీ ప్రభాకర్ రావు స్వయంగా పర్యవేక్షించేవారు. 

ఈ ఫోన్ ట్యాపింగ్‌లతో ఆయన చాలా మంది జీవితాలు నాశనం చేశారు. బాధితులలో బిఆర్ఎస్ పార్టీకి చెందినవారు కూడా చాలా మందే ఉన్నారు. పెద్దాయన (కేసీఆర్‌) ఆదేశం మేరకు ఆయన చెప్పిన వారి ఫోన్లు ట్యాపింగ్ చేసేవారిమని రాధా కిషన్ చెప్పారు. కానీ ఈ కేసులో ఇంతవరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కేసీఆర్‌, కేటీఆర్‌లకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. ఎందువల్ల? వారిని కాంగ్రెస్‌ ప్రభుత్వమే కాపాడుతోందని భావిస్తున్నాను.

ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చే ముందు కేటీఆర్‌ అక్కడకు వెళ్ళి ఆయనతో ఏం మాట్లాడారో చెప్పాలి. ఆయనకి కౌన్సిలింగ్ ఇచ్చేందుకే కేటీఆర్‌ అమెరికా వెళ్ళారని భావిస్తున్నాను. 

టీజీపీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకుల విషయం నేను బయటపెట్టి, కేటీఆర్‌ గురించి మాట్లాడినందుకు ప్రభాకర్ రావు నన్ను అరెస్ట్‌ చేయించారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్‌ కేసులో విచారణకి ఆయన సహకరించడం లేదని చెప్పుకోవడం సిగ్గుచేటు. 

ఒకవేళ కాంగ్రెస్‌ ప్రభుత్వం వల్ల కాదనుకుంటే ఈ కేసుని తక్షణం సీబీఐకి అప్పగించాలి. ఈ కేసులో వాంగ్మూలం ఇవ్వాలని సిట్ అధికారులు నన్ను కోరారు. నేను తప్పకుండా వెళ్ళి ఈ కేసు గురించి నాకు తెలిసిన విషయాలన్నీ చెపుతాను,” అని బండి సంజయ్‌ అన్నారు.