నోట్ల రద్దు చేసి రెండువారాలు దాటింది కానీ దేశంలో ఇంకా పరిస్థితులు సాధారణ స్థితికి రాలేదు. పెద్ద నగరాలలో నేటికీ ప్రజలు ఎటిఎంల దగ్గర పడిగాపులు కాస్తూనే ఉన్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులని సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన గురువారం రాత్రి 8 గంటలకి కేంద్రమంత్రివర్గ సమావేశం జరుగుతోంది. డిల్లీలో అందుబాటులో ఉన్న మంత్రులతో మోడీ సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో తాజా పరిస్థితులు, నగదు సరఫరా, బ్యాంకులు, పోష్టాఫీసులలో లావాదేవీలు, పాతనోట్లతో చెల్లింపులు వంటి అన్ని అంశాలపై చర్చించబోతున్నారు. దేశంలో సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి కనుక ఈరోజు జరుగబోయే మంత్రివర్గ సమావేశంలో వారికి ఊరటనిచ్చే నిర్ణయాలు కూడా తీసుకొనే అవకాశం ఉంది. నేటి అర్ధరాత్రితో పాతనోట్లతో పన్నులు, బిల్లుల చెల్లింపులు నిలిచిపోతాయి. దేశంలో సరిపడా కొత్త నోట్లు ఇంకా అందుబాటులోకి రాలేదు కనుక మరికొన్ని రోజులు పాతనోట్లతో బిల్లులు చెల్లింపులు, పెట్రోల్, గ్యాస్ కొనుగోలుకి అనుమతించే అవకాశం ఉన్నట్లు సమాచారం.